
హుళక్కి
ఉచిత ప్రయాణం
ఘాట్‌రోడ్డు నెపం చెప్పవద్దు
చింతపల్లి నుంచి నర్సీపట్నం, విశాఖలకు అధికంగా ప్రయాణం చేస్తుంటాం. లంబసింగి ఘాట్ మీదుగానే బస్సులు నడుస్తాయి. ఘాట్ రోడ్డు నెపంతో ప్రయాణానికి ఇబ్బందులు పెట్టవద్దు. ప్రస్తుతం ఘాట్‌లో ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కొత్త బస్సులను అందుబాటులోకి తేవాలి.
–వై.వెంకటేశ్వరమ్మ, ప్రయాణికురాలు, చింతపల్లి
సాక్షి, పాడేరు: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై జిల్లాలోని మహిళల ఆశలు సన్నగిల్లుతున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, శ్రీశైలం, పాడేరు ఘాట్ ప్రాంతాల్లో భద్రత పరంగా ఉచిత బస్ సర్వీసులు నడపలేమంటూ ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన తరుణంలో జిల్లావ్యాప్తంగా మహిళల ఉచిత ప్రయాణంపై సందిగ్ధత నెలకొంది. జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గాల పరిధిలో ఘాట్‌రోడ్లు అధికంగా ఉన్నాయి. పాడేరు నుంచి అరకులోయ మినహా మిగిలిన అన్ని రూట్లలో ఘాట్ భాగం అధికంగా ఉంది. జిల్లా నుంచి మైదాన ప్రాంతాలకు పోయే విశాఖపట్నం, ఎస్.కోట, నర్సీపట్నం రూట్లలో ఘాట్‌రోడ్డు ఉంది. అలాగే ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, పాడేరు–చింతపల్లి రోడ్డులో కొక్కిరాపల్లి ఘాట్, జి.మాడుగుల నుంచి మద్దిగరువు, చింతపల్లి నుంచి సీలేరు రోడ్డు, చింతపల్లి నుంచి రంపచోడవరం రోడ్డు, రంపచోడవరం నుంచి చింతూరు పోయే రోడ్డు, సీలేరు నుంచి చింతూరు పోయే ప్రధాన రోడ్లలో ఘాట్ అధికంగా ఉంది. జిల్లాలో 2 వేల కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఈ రూట్లలో ప్రస్తుతం ప్రతి ఆర్టీసీ బస్సులో 40 మంది దాటే ప్రయాణం చేస్తున్నారు. ఉచితం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కిటకిటలాడే బస్సుల్లో భద్రత ఏమేరకు ఉంటుందోనని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ఘాట్ ఎక్కుతుండగా ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా ఇంతవరకు చోటుచేసుకోలేదు.
పాడేరు ఆర్టీసీ డిపోలో బస్సులు
మన్యం మహిళలకు
ప్రయాణికుల భద్రత పేరిట ఘాట్‌రోడ్లలో నిలిపివేత
జిల్లాలో అధిక రూట్లు ఘాట్ ప్రాంతాలే రోజువారీ 5 వేల కి.మీ. సర్వీసు అందులో 2 వేల కి.మీ. ఘాటీయే.. అదనపు బస్సులు వస్తేనే ఉచితానికి అవకాశం
పాడేరు డిపోలో 47 బస్సులే
జిల్లాలో ఒక్క పాడేరు డిపో మాత్రమే ఉండగా, 47 బస్సులు సర్వీస్ చేస్తున్నాయి. జిల్లాకు సంబంధించి 22 రూట్లు ఉండగా, ఒక్క అరకు రూట్ మినహా మిగిలిన అన్ని రూట్లలో ఘాట్‌రోడ్డు ఉందని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. 40మందికి మించి ప్రయాణికులతో బస్సులు నడపలేమని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈలెక్కన అదనంగా బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంది. ఎస్.కోట, విశాఖపట్నం, అనకాపల్లి, తుని, నర్సీపట్నం, ఏలేశ్వరం, గోకవరం, రాజమండ్రి డిపోల నుంచి మరో 20 బస్సులు జిల్లాలో తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఘాట్ ప్రాంతం అధికంగా ఉండడంతో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడం ద్వారానే ఉచిత ప్రయాణం సురక్షితమవుతుంది. అయితే ఆ దిశలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పట్లో కొత్త బస్సులు పాడేరు డిపోకు వచ్చే పరిస్థితి కూడా లేదని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాడేరు డిపోలో ఉన్న 47 బస్సుల్లో 45 బస్సులు రోజువారీ సర్వీసు చేస్తుండగా, వాటిలో 15 బస్సులు వరకు పాతవే ఉన్నాయి. ఆ బస్సులు కూడా తరచూ మరమ్మతులకు గురవుతున్న పరిస్థితి. అన్ని రూట్లలో అదనంగా బస్సులు ఏర్పాటు చేసి ఉచిత ప్రయాణాన్ని సురక్షితం చేయాలని జిల్లా మహిళలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

హుళక్కి