
జల ప్రవాహంలో బిక్కుబిక్కుమని..
● సరియా వద్ద చిక్కుకున్న 32 మంది పర్యాటకులు ● భారీ వర్షానికి జలపాతం దారిలో గెడ్డ ఉధృతి ● గెడ్డ ఆవల చిక్కుకుపోయిన సందర్శకులు ● అప్రమత్తం చేసిన అనకాపల్లి ఎస్పీ ● రోప్ సహాయంతో రక్షించిన పోలీసు, ఫైర్, రెవెన్యూ సిబ్బంది
దేవరాపల్లి: సుందర సరియా జలపాతం కొన్ని గంటలపాటు వారి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ పర్యాటక ప్రాంతాన్ని చూద్దామని విశాఖ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన 32మంది సందర్శకులు ప్రాణాలు అర చేత పెట్టుకొని బిక్కుబిక్కుమని గడిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలోని సరియా జలపాతం సందర్శనకు మంగళవారం ఉదయం వీరు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం రావడంతో జలపాతానికి ముందు ఉన్న గెడ్డ ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించడంతో పర్యాటకులంతా అవతలి వైపు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. దేవరాపల్లి, చీడికాడ ఎస్‌లు వి.సత్యనారాయణ, బి.సతీష్, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులతో కలిసి సుమారు మూడు గంటలపాటు శ్రమించారు. గెడ్డ ఉధృతి తగ్గిన తర్వాత రోప్ సహాయంతో ఒక్కొక్కరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రాత్రి 10 గంటల సమయంలో దేవరాపల్లి ప్రాంతానికి తీసుకువచ్చారు. వీరిని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, సీఐ పైడపునాయుడు, చీడికాడ ఎస్‌ఐ బి.సతీష్, అనంతగిరి, దేవరాపల్లి తహసీల్దార్‌లు వీరభద్రచారి, పి.లక్ష్మీదేవి, జీనబాడు పంచాయతీ కార్యదర్శి రమ్య తదితరులు కలిసి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణి మాట్లాడుతూ వర్షాకాలంలో జలపాతాల సందర్శనలను రద్దు చేసుకోవాలని సూచించారు. సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన దేవరాపల్లి ఎస్‌ఐ సత్యనారాయణతోపాటు అగ్నిమాపక, రెవెన్యూ అధికారులను, స్థానికులను డీఎస్పీ అభినందించారు. సురక్షితంగా దేవరాపల్లి చేరుకున్న పర్యాటకులకు స్థానికంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి భోజన సదుపాయం కల్పించారు.

జల ప్రవాహంలో బిక్కుబిక్కుమని..