
నులి పురుగులతో ఎదుగుదలకు అవరోధం
● ఆల్బెండజోల్ మాత్రలతోనే ఈ సమస్యకు పరిష్కారం ● విద్యార్థులతో మాత్రలు మింగించిన కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు: పిల్లల్లో నులి పురుగుల వలన రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి మానసిక, శారీరక అభివృద్ధి దెబ్బతింటుందని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. ఈ సమస్యను నివారించటానికి 2 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు వయసున్న పిల్లలందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన పట్టణంలోని శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో నులిపురుగుల మాత్రలను మింగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నులిపురుగులు దీర్ఘకాలంలో మానవ ఆరోగ్యానికి హానికరమని, నిరంతరం ఇన్ఫెక్షన్ వలన పిల్లల అభ్యాసం, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 3214 అంగన్‌వాడీ కేంద్రాలు, 3124 ప్రభుత్వ పాఠశాలలు, 82 ప్రైవేటు పాఠశాలలు, 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 16 ఐటీఐ, పాలిటెక్నిక్, నర్శింగ్ కళాశాలల్లో రెండేళ్ల నుంచి 19 ఏళ్లలోపు వయసున్న 3,16,754 మంది అర్హులైన విద్యార్థులుండగా 95.6 శాతంమందితో ఆల్బెండజోల్ మాత్రలను మింగించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4321 టీంలను ఏర్పాటు చేసి, 336 మంది పర్యవేక్షణ సిబ్బందిని నియమించామన్నారు. ఆల్బెండజోల్ మాత్రల వల్ల ఏమైనా దుష్ప్రభావం తలెత్తితే సమీపంలో ఉన్న వైద్య సిబ్బందిను సంప్రదించాలన్నారు. ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారి, ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి.ప్రతాప్, ప్రోగ్రామ్ మేనేజర్ ఏగిరెడ్డి కిశోర్‌కుమార్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.