‘స్పెషల్‌ డీఎస్సీ సాధన’కు 19న రైల్‌రోకో | - | Sakshi
Sakshi News home page

‘స్పెషల్‌ డీఎస్సీ సాధన’కు 19న రైల్‌రోకో

May 17 2025 6:04 AM | Updated on May 17 2025 6:04 AM

‘స్పె

‘స్పెషల్‌ డీఎస్సీ సాధన’కు 19న రైల్‌రోకో

పాడేరు : గిరిజన ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్పెషల్‌ డీఎస్సీ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 19న అరకువ్యాలీలో రైల్‌రోకో నిర్వహిస్తున్నట్టు స్పెషల్‌ డీఎస్సీ సాధన సమితి జిల్లా చైర్మన్‌ కుడుముల కాంతారావు వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని మోదకొండమ్మ తల్లి ఇండోర్‌ ఆడిటోరియంలో నిర్వహించిన సాధన సమితి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్‌ రోకోలో భాగంగా కేకే లైన్‌లో గూడ్స్‌లతో సహా అన్ని సర్వీసులను అడ్డుకుంటామన్నారు. గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స మాట్లాడుతూ మెగా డీఎస్సీలో ఆదివాసీలకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో శతశాతం పోస్టులు కేటాయిస్తూ ఈనెల 15 నాటికి ఉత్తరు్‌ువ్ల జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. సీఎం చంద్రబాబు కేవలం తన ప్రకటనలతోనే సరిపెట్టారన్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలైతే ఆరు శాతం అంటే రాష్ట్రంలో కేవలం 980 పోస్టులు మాత్రమే గిరిజనులకు దక్కుతుందని ఆ మాత్రం కూడా అవగాహన లేని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 2030 పోస్టులు గిరిజనులకు దక్కుతుందని అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలైతే గిరిజనులు సుమారు 3వేల ఉపాధ్యాయ పోస్టులను కోల్పోతారన్నారు. ఈనెల 20న జరిగే రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో స్పెషల్‌ డీఎస్సీపై ప్రకటన చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఏజెన్సీ స్పెషల్‌ డీఎస్సీ సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా చైర్మన్‌గా కుడుముల కాంతారావు, కన్వీనర్‌గా సాగిన ధర్మన్న పడాల్‌, మహిళ విభాగం జిల్లా చైర్‌పర్సన్‌గా కాంగు సుభశర్మ, జిల్లా మహిళ విభాగం కన్వీనర్‌గా కవడం కాసులమ్మ, మేధావుల ఫోరం చైర్మన్‌గా వల్ల వెంకటరమణ, కన్వీనర్‌గా రావుల జగన్‌మోహన్‌, విద్యార్థి విభాగం కన్వీనర్‌గా కె. రాజశేఖర్‌, డీఎస్సీ అభ్యర్థుల కమిటీ కన్వీనర్‌గా రొబ్బా ప్రశాంత్‌ కుమార్‌తోపాటు కోకన్వీనర్లు, సలహాదారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి

రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాసుదొర డిమాండ్‌ చేశారు. స్థానిక ఐటీడీఏ ఎదుట రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ తెల్లం శేఖర్‌ అధ్యక్షత వహించారు. దీక్షల్లో కొమరం సూర్య చంద్ర, మట్ట కృష్ణారెడ్డి, వెంకన్న దొర, సత్యనారాయణరెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు.

కేకే లైన్‌లో అన్ని సర్వీసులను

అడ్డుకుంటాం

20న జరిగే రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ప్రకటన చేయకుంటే ఉద్యమం ఉధృతం

స్పెషల్‌ డీఎస్సీ సాధన సమితి

జిల్లా చైర్మన్‌ కాంతారావు హెచ్చరిక

‘స్పెషల్‌ డీఎస్సీ సాధన’కు 19న రైల్‌రోకో 1
1/1

‘స్పెషల్‌ డీఎస్సీ సాధన’కు 19న రైల్‌రోకో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement