
జల్‌జీవన్ మిషన్‌తో నాణ్యమైన తాగునీటి సరఫరా
సాక్షి,పాడేరు: జిల్లాలో ఇంటింటికి కుళాయిల ద్వారా నాణ్యమైన తాగునీటి సరఫరా జలజీవన్ మిషన్ లక్ష్యమని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లా తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 4,970 గ్రామాలకు గాను ఇప్పటివరకు 1340 గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా శతశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. జిల్లాలో 2.40 లక్షల గృహాలు ఉండగా, 1.22లక్షల గృహాలకు తాగునీరు అందుతుందన్నారు. మిగిలిన 1.18లక్షల గృహాలకు నీరందించేలా జల్‌జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు నిర్ణీత సమయానికి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. జల్‌జీవన్ మిషన్‌లో జిల్లాకు రూ.626కోట్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.144కోట్లు ఖర్చు జరిగిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు వెనుకంజలో ఉన్నాయన్నారు.అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి 17శాతం కేంద్రాలకు రన్నింగ్ వాటర్, మరుగుదొడ్ల నిర్మాణాల పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కె.జవహర్‌కుమార్, కమిటీ సభ్యులు డీఈవో బ్రహ్మజీరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ ఎస్తేరు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, డీఆర్‌డీఏ ఏపీడీ లాలం సీతయ్య, డీపీఆర్‌వో గోవిందరాజులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్