
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): ఈనెల 20 నుంచి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ అరకులోయ పరిధిలోని ఐటీడీఏ టూరిజం కార్మికులు గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, చాపరాయి, కొత్తపల్లి జలపాతం కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈమేరకు స్థానిక మేనేజర్లకు సమ్మె నోటీసులు ఇచ్చినట్టు ఆయన వివరించారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ రద్దు చేయాలని, కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయకపోవడమే కాకుండా కనీస వేతన చట్ట ప్రకారం పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలకు నోచుకోవడం లేదన్నారు. ఈనెల 20న అన్ని యూనిట్లు మూసి వేసి విధులు బహిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంతల రాజు, జయరాజు, రాంబాబు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉమామహేశ్వరరావు పిలుపు

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి