
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ముంచంగిపుట్టు: ఆస్పత్రులో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. ఆదివారం స్థానిక సీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లోని రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. చర్మవ్యాధులతో బాధపడుతున్న రంగబయలు పంచాయితీ గొబ్బరపడకు చెందిన ఐదుగురు చిన్నారులను పరిశీలించారు. వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉందని చిన్నారుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు తెలియజేశారు.తక్షణమే గొబ్బరపడలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పటు చేయాలని వైద్యులకు ఆయన సూచించారు.అనంతరం ఆస్పత్రిలో సమస్యలను వైద్యాధికారిణి గీతాంజలి నుంచి తెలుసుకున్నారు. మందులు,సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ఆస్పత్రిలో మందులు, వైద్య సిబ్బంది కొరత లేకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, మండల ప్రధాన కార్యదర్శి ముక్కి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశం
ముంచంగిపుట్టు సీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ