భారత్ విజయాన్ని కాంక్షిస్తూ గాయత్రీ హోమం
డాబాగార్డెన్స్: ఆపరేషన్ సింధూర్–2 విజయవంతంగా నిర్వహించిన భారత ఆర్మీకి మనోధైర్యం కలగాలని భారతమాతను ప్రార్థిస్తూ శుక్రవారం పాతనగరంలోని స్వామి వివేకానంద సంస్థలో గాయత్రి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు మాట్లాడుతూ తెలుగు తేజం వీర జవాన్ మురళీ నాయక్‌కు, ఈ పోరాటంలో వీర మరణం పొందిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ విజయంతో ముందుకు దూసుకుపోతున్న భారతదేశ సైన్యానికి వందనాలు తెలిపారు. మన సైనికులకు మరింత మనోధైర్యం కలగాలని కాంక్షిస్తూ కుల, మతాలకు అతీతంగా గాయత్రి హోమం నిర్వహించామని తెలిపారు. జయహో ఆర్మీ సైన్యమంటూ ట్యూషన్ విద్యార్థులు నినదించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు సీహెచ్ పైడిరాజు, వి. నల్లరాజు, ట్యూషన్ పిల్లలు, ఆశ్రమ వాసులు తదితరులు పాల్గొన్నారు.


