వాటర్‌షెడ్ చెరువులతో భూగర్భ జలాల వృద్ధి
ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ
కొయ్యూరు: భూగర్భ జలాల పెంపునకు వాటర్‌షెడ్ పథకంలో నిర్మించిన చెరువులు కీలకపాత్ర పోషిస్తాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. మండలంలో మంప పంచాయతీ రాజులబాబు ఆలయం సమీపంలో నిర్మించిన రెండు చెరువులు, కించవానిపాలెం జలాశయం, గంగవరంలో నిర్మించిన రెండు చెరువులను, మంపలో అల్లూరి పార్క్‌ను, అక్కడ నాడు అల్లూరి స్నానం చేసిన కొలనును సోమవారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నివాసం ఉన్న ఉర్లకొండ గుహను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. కొయ్యూరు మండలంలో జీడితోటల విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్యాస్ గోడౌన్ మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. గంగవరంలో బోరు లేక గ్రామస్తులు తాగునీటికి పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి రావడంతో బోరు మంజూరు చేసేందు కు చర్యలు తీసుకున్నారు. గంగవరం నుంచి నేరుగా కొయ్యూరు వచ్చేందుకు గతం నుంచి ఉన్నా మార్గాన్ని అభివృద్ధి చేసేందు చర్యలు తీసుకుంటామన్నారు. కించవానిపాలెం జలాశయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఎంపీపీ బడుగు రమేష్‌బాబు పీవోను కోరారు. ఆమె సానుకూలంగా స్పందిస్తూ వాటర్‌షెడ్ పథకంలో నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన సమాచారం పంపాలని ఆమె వాటర్ షెడ్ ఏపీవో శంకర్‌రావును ఆదేశించారు.


