దుంప తీపి..ధర చేదు
గత ఏడాది కంటే సగానికి తగ్గిన ధర
50 కిలోల బస్తా రూ.800కు కొనుగోలు
గత ఏడాది రూ.1500తో వ్యాపారం
సంతల్లో వ్యాపారులు సిండికేట్
ఉసూరుమంటున్న గిరిజన రైతులు
సాక్షి, పాడేరు: జిల్లాలో గిరిజన రైతులు సాగుచేస్తున్న చిలగడదుంప పంటకు గిట్టుబాటు ధర కరువైంది. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారపుసంతలు. మండల కేంద్రాల్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి చిలగడదుంపల కొనుగోలు ధరలను తగ్గించేస్తున్నారు. గత ఏడాది కంటే ధరలను భారీగా తగ్గించడంతో రైతులంతా ఉసూరుమంటున్నారు. 50కిలోల బస్తా ధర గత ఏడాది రూ.1500 ఉండగా, ఈఏడాది రూ.900కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే సగానికి ధర పడిపోయింది.
700 ఎకరాల్లో సాగు
పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో 700 ఎకరాల్లో చిలగడదుంప పంటను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ఎకరంలో నాట్లు వేసేందుకు, కలుపు నివారణ, పంట సేకరణ, దుంపల శుద్ధికి సుమారు రూ.20 వేల వరకూ ఖర్చు అవుతుంది. జీకే వీధి, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో పంట దిగుబడి ప్రారంభమవడంతో తవ్వి సేకరిస్తున్న గిరిజన రైతులు వాటిని శుద్ధి చేసి, వారపుసంతలకు తరలించి అమ్మకాలు జరుపుతున్నారు. జీకే వీధి, చింతపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు వ్యాపారులే నేరుగా వ్యాన్‌లతో వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. గత ఏడాది ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం లభించింది.ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ధరలు తక్కువుగా ఉండడంతో చిలగడదుంప సాగు నష్టాలను మిగులుస్తోందని రైతులు వాపోతున్నారు
పలు రాష్ట్రాల్లో డిమాండ్
గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగుచేసే చిలగడదుంపలకు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ,ఒడిశా,పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఆయా రాష్ట్రాల్లో పెద్ద వ్యాపారుల నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు స్థానిక వ్యాపారులు.. గిరిజన రైతుల నుంచి చిలగడదుంపలను కొనుగోలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో రిటైల్‌గా చిలగడ దుంపలను కిలో రూ.40 నుంచి రూ.50 వరకూ వ్యాపారులు అమ్మకాలు జరుపుతున్నారు. బస్తా దుంపలను రూ.1500కు కొనుగోలు చేసిన వ్యాపారులకు అధిక లాభాలు వస్తున్నాయి, కానీ రైతులు మాత్రం నష్టపోతున్నారు.
వర్తకులు నిర్ణయించిందే ధర
గిరిజన రైతులు పండించిన చిలగడ దుంపకు మార్కెటింగ్ సదుపాయం లేదు. స్థానిక వర్తకులు గిరిజన గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. ధరలు కూడా వారే నిర్ణయిస్తారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకు మాత్రమే రైతులు విక్రయించుకోవాల్సి వస్తోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు.
చిలగడ దుంప(స్వీట్ పొటాటో)కు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆదివాసీ రైతులు దిగాలు చెందుతున్నారు. దళారులు, వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తుండడంతో తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం కరువు
చిలగడదుంప పంట సాగు చేస్తున్న గిరిజన రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. రైతు లు తమ సంప్రదాయ విత్తనాలనే సాగుకు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా విత్తనా లు పంపిణీ చేయడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధర తగ్గించేశారు..
చిలగడదుంప సాగుతో ప్రతి ఏడాది రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. గత ఏడాది 50 కిలోల బస్తాను రూ.1500 ధరతో అమ్మకాలు జరిపి అధిక ఆదాయం పొందాను. ఈ ఏడాది హుకుంపేట, పాడేరు సంతల్లో బస్తా దుంపలను రూ.900కు మించి వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాం.
– కె.తౌడన్న, గిరిజన రైతు, అల్లంపుట్టు, హుకుంపేట మండలం
గిట్టుబాటు ధర లేక నష్టం
సంతల్లో వ్యాపారులంతా సిండికేట్‌గా మారడంతో నష్టపోతున్నాం. చిలగడదుంపలను వ్యాపారులు తక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నారు. నాణ్యతలో నంబర్–1గా ఉన్న మన్యం దుంపలకు ఈఏడాది గిట్టుబాటు ధరలు లేకపోవడం బాధనిపిస్తోంది.
–కె.వంతాల రాము, గిరిజన రైతు, కించుమండ, డుంబ్రిగుడ మండలం
దుంప తీపి..ధర చేదు
దుంప తీపి..ధర చేదు
దుంప తీపి..ధర చేదు


