జెడ్పీ నిధులతో గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు.మండలంలో సుజనకోట పంచాయతీ గొడుగులపుట్టులో జెడ్పీ నిధులు రూ.5 లక్షలతో నిర్మించనున్న 100 మీటర్ల సీసీరోడ్డు పనులను సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, పలు ప్రశ్నాలకు జవాబులు రాబట్టారు. పాఠశాల ఆవరణంలో అసంపూర్తిగా ఉన్న భవనం గురించి ఆరా తీశారు. పాఠశాల భవనాన్ని పూర్తి చేసేందుకు నిధులు, నూతన అంగన్‌వాడీ భవనం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. దశాలవారీగా సమస్యలు పరిష్కరించనున్న ట్టు చెప్పారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్టు చెప్పారు. చంద్రబాబు ప్రభు త్వ పాలనలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పింఛన్ల ఊసే లేదన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు రమేష్, బాబూరావు, నరసింగరావు, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, గణపతి, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు,వైఎస్సార్‌సీపీ జిల్లా నేత మూర్తి, ఉపసర్పంచ్ రుక్మిణి,నేతలు తిరుపతిరావు,సన్యాసిరావు పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర


