
సీహెచ్‌డబ్ల్యూలను ఆశావర్కర్లుగా గుర్తించాలి
చింతపల్లి: మన్యంలో విధులు నిర్వహిస్తున్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలను(సీహెచ్‌డబ్ల్యూ)ఆశా కార్యకర్తలుగా గుర్తించాలని సీఐటీయూ మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. మంగళవారం లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌డబ్ల్యూలతో కలసిధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో దశాబ్దాలుగా గ్రామాల్లో వైద్య పరమైన సేవలు అందజేస్తున్న వారు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వీరిని ఆశా కార్యకర్తలుగా గుర్తించడమే కాకుండా ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి రూ.26 వేలు వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. చట్టపరంగా వారికి అందవలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని కోరారు.ఈ సందర్భంగా పది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి అందజేశారు. సీఐటీయూ నాయకులు మజ్జి రాంబాబు, ఆశా కార్యకర్తలు రాజేశ్వరి,రమణమ్మ,స్రవంతి పాల్గొన్నారు.