ఈదురుగాలులతో భారీ వర్షం
పెదబయలు: మండలంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం కూడా ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఈదురుగాలులకు పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కాలంలో ఏమాత్రం వర్షం కురిసినా విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ
రాజవొమ్మంగి: మండలంలోని రేవటిపాలెం సమీపంలో ఈదురుగాలులు, భారీ వర్షానికి పడిపోయిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. శనివారం వీచిన ఈదురుగాలులకు ఈ ప్రాంతంలో మూడు స్తంభాలు ఒరిగిపోవడంతో వైర్లు తెగిపోవడం తెలిసిందే. ఆదివారం వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా యంత్రాల సాయంతో విద్యుత్ స్తంభాల పునరుద్ధణ పనులను సిబ్బంది చేపట్టారు. విద్యుత్‌శాఖ ఏఈ దొర పర్యవేక్షించారు.
కొయ్యూరు: భారీ వర్షానికి మండలంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. మండల కేంద్రంలో వారపు సంతకు తక్కువ మంది వ్యాపారులు వచ్చారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రోడ్డుకు అడ్డంగా కూలిన భారీ వృక్షం
పాడేరు రూరల్: మండలంలో ఆదివారం ఈదురుగాలులతో కురిసిన వర్షానికి దేవాపురం – తర్గం మార్గంలో భారీ మామిడి చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. అధికారులు చెట్టు తొలగింపు పనులు చేపట్టకపోవడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కూలిన చెట్టును తొలగించాలని వారు కోరుతున్నారు.
ఈదురుగాలులతో భారీ వర్షం


