
మోదాపుట్టు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్
కలెక్టర్ సుమిత్ కుమార్
సాక్షి, పాడేరు: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో తొలగించిన జాబ్‌కార్డులను పునఃపరిశీలించి, తొలగింపు కారణాలతో సహా పూర్తి నివేదిక అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీడీవోలను ఆదేశించారు. అదే విధంగా వేతనదారులకు పనికల్పించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ గత మూడు సమావేశాల నుంచి చెబుతున్నప్పటికీ సరిగా స్పందించకపోవడం పట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. వచ్చేనెల 10వ తేదీలోగా నివేదికలు అందించాలని, పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త పనులకు అంచనాలు తయారు చేసి ప్రతిపాదిస్తే మంజూరు చేస్తామని చెప్పారు. పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్ వివరాలు సమర్పించాలని మండల విద్యాశాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులు ఎంతమంది బడిబయట ఉన్నదీ వివరాలు తెలియజేయాలన్నారు. భవనాలు లేని పాఠశాలలు, విద్యావలంటీర్ల ఎక్కడ అవసరమో గుర్తించి వివరాలు అందజేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. డిజిటల్ తరగతుల పరికరాలను వెంటనే ఇన్‌స్టాల్ చేయాలన్నారు. లేట్‌బర్త్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఆమోదించిన జాబితాను ఆయా మండలాలకు పంపించినప్పటికీ సంబంధిత పంచాయతీ కార్యదర్శులు బర్త్‌సర్టిఫికెట్లను జారీ చేయడంలో తాత్సారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులను రేషన్‌లైజ్ చేయాల్సిందిగా డీపీవోను ఆదేశించారు. వారి హాజరును పర్యవేక్షించాలని డీఎల్డీవో శాంతకుమారిని ఆదేశించారు. ఈ సమావేశంలో డీబీటీ మేనేజర్ నరేష్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా మేనేజర్ సునీల్ పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థుల భవిష్యత్తుపై
ప్రత్యేక ప్రత్యేక దృష్టి
గిరిజన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. దిగుమోదాపుట్టు ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ముందుగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థుల సంక్షేమం, అమలుచేస్తున్న విద్యా కార్యక్రమాలు, పాఠశాలలో సమస్యలపై కలెక్టర్ సమీక్షించారు. కిచెన్ నిర్మాణంతో పాటు మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సమస్యలను పరిష్కరించాలని హెచ్‌ఎం, వార్డెన్‌లు కలెక్టర్‌ను కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆయా సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. రన్నింగ్ వాటర్ పనులను వెంటనే చేపట్టి ఖర్చుల వివరాలతో బిల్లును ఏటీడబ్ల్యూవోకి అందజేయాలని, నగదు చెల్లిస్తామన్నారు.డైనింగ్ రూమ్,కిచెన్ షెడ్ నిర్మాణాలకు పంచాయతీరాజ్ ఏఈఈ ద్వారా అంచనాలు తనకు పంపాలని కలెక్టర్ తెలిపారు.