ఉద్యోగావకాశాలు కల్పించండి

ముంచంగిపుట్టు: ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో స్థానిక నిరుద్యోగ గిరిజన యువతకు ఒప్పంద ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన గిరిజనులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావును మండలంలోని నిరుద్యోగ గిరిజన యువత కలిసి ప్రాజెక్టులో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. జోలాపుట్టు జలాశయం వల్ల పూర్వీకులు వ్యవసాయ భూములు కోల్పోయారని, వారు నిరక్షరాస్యులు కావడంతో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు పొందలేకపోయారని వారు వివరించారు. ప్రస్తుతం తామంతా ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నామన్నారు. ప్రాజెక్టులో తాజాగా జరగనున్న ఒప్పంద కార్మికుల భర్తీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శ్రీబిరసాముండా గిరిజన కార్మిక సంఘానికి చెందిన గిరిజన యువకులు వి.శేషాద్రి ,వి.జయరాం, మదన్‌ తదితరులు ఎస్‌ఈకి విన్నవించారు. దీనిపై ఎస్‌ఈ నాగేశ్వరావు సానుకూలంగా స్పందించారు. మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 20 ఒప్పంద కార్మిక పోస్టులు మంజూరు అయ్యాయని, వాటిలో సాధ్యమైనంత వరకు అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.




 

Read also in:
Back to Top