వనితకు వంచన | All three Rajya Sabha seats dedicated to Kotari | Sakshi
Sakshi News home page

వనితకు వంచన

Jun 7 2026 4:58 AM | Updated on Jun 7 2026 4:58 AM

All three Rajya Sabha seats dedicated to Kotari

సీఎం చంద్రబాబుతో రాజ్యసభ అభ్యర్థులు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ

ఇంతే ఇంతింతే.. బాబు తీరంతే!   

మహానాడు మహిళా నాటకం బట్టబయలు 

ఒక్క రాజ్యసభ సీటూ ఇవ్వకుండా మోసం  

తీర్మానాలు మహానాడుకే పరిమితం 

రాజ్యసభ మూడు సీట్లూ కోటరీకి అంకితం 

తనయుడి కోటరీలోని లాబీయిస్టులకే అగ్రతాంబూలం 

సానా, భాష్యం, విజయ్‌లకు సీట్లు 

సీనియర్లు, దళిత నేతలకు శరాఘాతం 

యనమల ఆశలపై నీళ్లు.. వర్ల రామయ్యకు మొండిచేయి  

సాక్షి, అమరావతి:  మహిళలపై దేశంలో ఎవరికీ లేనంత చిత్తశుద్ధి తనకే ఉందని ఇటీవల మహానాడు వేదికగా చెప్పుకున్న చంద్రబాబు అంతలోనే నారీ లోకానికి తాను ఇచ్చిన మాటను విస్మరించారు. ఇంతే ఇంతింతే.. తన తీరింతే అని చాటుకున్నారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ మహానాడు వేదికగా చేసిన తీర్మానా­న్ని రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో తుంగలో తొక్కేశారు. 

తన కుమారుడు లోకేశ్‌ కోటరీలోని లాబీయిస్టులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లకు రాజ్యసభ స్థానాలను కేటాయించారు. మహిళలకు అంత పెద్ద అవకాశాలను ఇవ్వబోమని తేల్చేశారు. మహిళలకు ‘పెద్ద’పీట.. మహానాడులో తీర్మానం వరకే పరిమితమని ఆచరణలో తనకు కార్పొరేట్‌ లాబీయిస్టులే ముఖ్యమని ఈ ఎంపిక ద్వారా రుజువు చేసుకున్నారు.  

మహానాడు తీర్మానాలు.. పబ్లిసిటీ డ్రామాలే
ఇటీవల ఆన్‌లైన్‌లో ఆర్భాటంగా నిర్వహించిన మహా­నాడు­ను మహిళా శక్తి పేరుతో నిర్వహించి తమ పార్టీ వారి కోసమే ఉన్నట్లు హడావుడి చేశారు. పార్టీ పదవులు, రాబోయే ఏ ఎన్నికలైనా సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తీర్మానాలు కూడా చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇవ్వాలంటూ చంద్రబాబు స్వయంగా లేఖలు రాసి జాతీయ స్థాయిలో ప్రచారం పొందాలని చూశారు. 

తీరా మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేసే అవకాశం వచ్చేసరికి ఒక్క మహిళకు కూడా చోటు కల్పించకుండా తన అసలు నైజాన్ని చాటుకున్నారు. 33 శాతం రిజర్వేషన్ల మాట అటుంచితే కనీసం ఒక్క సీటు కూడా కేటాయించకుండా మహిళా లోకాన్ని చంద్రబాబు ఘోరంగా వంచించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన చిత్తశుద్ధి కేవలం మైకుల ముందు, తీర్మానాలకే పరిమితమని ఈ నిర్ణయంతో తేలిపోయింది.

సీనియర్లకు అవమానం.. లోకేశ్‌ కోటరీకే పెద్దపీట
పార్టీ కోసం దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేసిన సీని­యర్లనూ పక్కనపెట్టారు. చంద్రబాబు సమకాలి కుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆయన హస్తగతం కావడంలో కీలకపాత్ర పోషించిన యనమల రామకృష్ణుడిని అసలు పరిగణనలోకే తీసుకోకుండా అవమానించారు. తాను గౌరవప్రదంగా రాజకీయాల నుంచి తప్పుకునేలా చివరిసారిగా రాజ్యసభ అవ­కాశం ఇవ్వాలని యనమల కోరినా పట్టించుకోలేదు. అన్నివేళలా చంద్రబాబు వెన్నంటి ఉండే దళిత నేత వర్ల రామయ్యకూ మొండిచేయి చూపారు. దీంతో దళితులకు పెద్దపీట వేస్తానంటూ చంద్రబాబు చెప్పే సూక్తులన్నీ ఉత్తి మాటలేనని తేలిపోయింది. 

సీట్లు ఆశించిన పార్టీలోని చాలామంది సీనియర్లను అసలు పరిగణనలోకి తీసుకోకుండా అర్థ బలం ఉన్న వారి వైపే తాను ఉంటానని స్పష్టం చేశారు. టీడీపీలో మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తున్నా సరే వివాదాస్పద నేత సానా సతీష్‌కి రెండవసారి రాజ్యసభ సీటు కట్టబెట్టారు. లోకేశ్‌ వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో సీనియర్లను కాదని ఆయనకు అవకాశం కల్పించారు. పార్టీకి కొత్త అయినా కార్పొరేట్‌ శక్తుల కోటాలో భాష్యం రామకృష్ణకు ఒక సీటు కేటాయించారు. 

జూనియర్‌ నేత అయినప్పటికీ లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కొడుకు చింతకాయల విజయ్‌కి అవకాశం ఇచ్చారు. దీంతో పార్టీని నమ్ముకున్న సీనియర్‌ నేతలు, మహిళా నేతలకు మరోసారి ఘోర అవమా­నం తప్పలేదు. మహిళలకు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, సీనియర్లకు గౌరవం వంటివన్నీ కేవలం ఎన్నికల నినాదాలే తప్ప ఆచరణలో శూన్యమ­ని ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపిక ద్వారా రుజువు చేశారు. 

Advertisement