రిమ్స్‌లో 150 పడకలతో సెంటర్ మంజూరు మాతాశిశువులకు ఇక మెరుగైన వైద్యసేవలు మరణాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరుతోంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేకంగా ఎంసీహెచ్ సెంటర్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో 150 పడకలతో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టీనా జడ్ చోంగ్త్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవిస్తున్న క్రమంలో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. ఇటీవల రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడగా, సరైన వైద్యం అందక గర్భిణులు మృతిచెందిన ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిని అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని మంజూరు చేసింది. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే ఒకేచోట మాతా శిశువులకు వైద్యసేవలు అందనున్నాయి. రిమ్స్ ఆవరణలో రూ.50 కోట్లతో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
రిఫర్ కేసులతో పెరిగిన తాకిడి..
రిమ్స్ ప్రతిరోజు రోగుల తాకిడితో కిటకిటలాడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రకు చెందినవారు ఇక్కడికి వస్తుంటారు. గర్భిణులు, బాలింతలకు సంబంధించి ఎక్కువ మందిని చేర్పిస్తారు. ఉట్నూర్‌లో జిల్లా ఆస్పత్రి ఉన్నప్పటికీ ఇక్కడికే రిఫర్ చేస్తున్నారు. ఆయా పీహెచ్‌సీల్లో సైతం డెలివరీలు జరగడం లేదు. ఈ క్రమంలో రిమ్స్ వైద్యులపై సైతం పని ఒత్తిడి పెరిగింది. మాతా శిశు ప్రత్యేక భవనం లేకపోవడంతో ప్రస్తుతం మెటర్నిటి వార్డులో సరిపడా బెడ్లు లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులకు సైతం సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు రిమ్స్ అధికారులు ప్రభుత్వానికి ఎంసీహెచ్ విభాగం ఏర్పాటు చేయాలని మొర పెట్టుకోగా, ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈనెల 4న జీవో నం.411ను జారీ చేసింది. సెప్టెంబర్ 23న పంపిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ అంగీకారం తెలపడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
150 పడకలతో..
ప్రస్తుతం రిమ్స్‌లో మెటర్నిటి విభాగంలో 50 వరకు పడకలు ఉన్నాయి. ఎంసీహెచ్ భవనం ఏర్పాటయితే వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరగడంతో పాటు 150 పడకలు అందుబాటులోకి రానున్నాయి. నాణ్యమైన వైద్యసేవలతో పాటు మాతా శిశు మరణాల సంఖ్య తగ్గనుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్, ల్యాబ్ పరీక్షలు, బ్లడ్‌బ్యాంక్, ఇలా అన్ని సేవలు ఒకేచోట అందనున్నాయి.
రిమ్స్ ఆస్పత్రి
మరింత మెరుగైన వైద్యసేవలు
రిమ్స్‌లో ఎంసీహెచ్ సెంటర్ అందుబాటులోకి వస్తే గర్భిణులు, బాలింతలు, శిశువులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. జీవో విడుదలైనట్లు సమాచారం ఉన్నప్పటికీ అధికారికంగా అందలేదు. 150 బెడ్లతో ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. జిల్లా వాసులకు ఎంతగానో దోహదపడనుంది.
– వెంకట్ లకావత్, రిమ్స్ సూపరింటెండెంట్
150 పడకలతో మంజూరు
ఆదిలాబాద్: మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు ఇక మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిమ్స్‌లో రూ.50 కోట్లతో 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో భవన నిర్మాణం, వైద్య పరికరాలు సమకూరనున్నాయి.
– పాయల్ శంకర్, ఎమ్మెల్యే


