డీసీఎంఎస్‌.. ఇక లేనట్లేనా! | - | Sakshi
Sakshi News home page

డీసీఎంఎస్‌.. ఇక లేనట్లేనా!

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

మార్క్‌ఫెడ్‌లో విలీనానికి ప్రభుత్వ నిర్ణయం త్వరలో ఉత్తర్వులు వచ్చే అవకాశం నష్టాలున్న సంస్థలో విలీనంపై అభ్యంతరాలు

కై లాస్‌నగర్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘం (డీసీఎంఎస్‌)ను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్‌, వరంగల్‌ డీసీఎంఎస్‌లను విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. జిల్లాకు సంబంధించి త్వరలోనే జారీ కానున్నట్లుగా తెలుస్తోంది. రూ.కోట్లాది ఆస్తులతో పాటు రూ.4కోట్ల లాభాల బాటలో పయనిస్తున్న ఈ సంస్థను రూ.వేల కోట్ల నష్టాల్లో ఉన్న మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆ సంస్థ మాజీ చైర్మన్‌లు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది.

రూ.4కోట్ల లాభాల్లో ..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను విక్రయించడంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఇలాంటి వ్యాపారాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ 2020 నుంచి లాభాల బాటలో పయనిస్తోంది. 2025–26 సంవత్సరానికి సంబంధించి అధికారికంగా నిర్వహించిన ఆడిట్‌ లెక్కల ప్రకారం రూ.4 కోట్ల లాభాల బాటలో ఉంది. 2024–25లో రూ.65లక్షలు, 2023–24లో రూ.70లక్షల ఆదాయం సమకూరినట్లుగా తెలుస్తోంది.

రూ.10 కోట్ల విలువైన స్థిరాస్తులు..

డీసీఎంఎస్‌ ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు విలువైన భూములు, గోదాములు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలను కలిగి ఉంది. మంచిర్యాల జిల్లా జన్నారంలో 2.5 ఎకరాలు, బోథ్‌లో అర ఎకరం, నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఎకరం భూమి ఉంది. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆరుగుంటల్లో జిల్లా సంస్థ కార్యాలయంతో పాటు వాణిజ్య సముదాయాలతో కూడిన మడిగెలు ఉన్నాయి. అలాగే రెండు గోదాంలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ.10కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుందని సంస్థ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. లాభాల బాటలో నడుస్తుండటంతో పాటు సొంతంగా కోట్లాది రూపాయల ఆస్తులు కలిగిన ఈ సంస్థను నష్టాల్లో ఉన్న మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే సంస్థ మనుగడ ప్రశ్నార్థకం కావడంతో పాటు ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశముందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డీసీఎంఎస్‌ సంస్థ వివరాలు

పీఏసీఎస్‌లు : 177

ఎరువులు, సీడ్స్‌ విక్రయకేంద్రాలు : 167

ధాన్యం కొనుగోలు కేంద్రాలు : 98

సంస్థకు ఉన్న ఆస్తుల విలువ : రూ.10 కోట్లు

సంస్థ ఉద్యోగులు : 13 మంది

26న అత్యవసర సమావేశం ..

డీసీఎంఎస్‌ను మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు గాను ఈ నెల 26న అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ బిజినెస్‌ మేనేజర్‌ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. సంస్థ పర్సన్‌ ఇన్‌చార్జి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఆర్‌ఎస్‌.చిత్రు అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని సహకార బ్యాంకు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. డీసీవోతో పాటు ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్‌ సొసైటీల మాజీ అధ్యక్షులు, బి.క్లాస్‌ సొసైటీ సభ్యులు హాజరై చర్చించనున్నారు. విలీనం విషయంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement