సాక్షి,ఆదిలాబాద్: డెత్ ఓటరు నేను బతికి ఉన్నానని రాలేదు.. డూప్లికేట్ అంశంలో నాది నకిలీ ఓటు కాదని ఎవరైతే చెప్పలేదు.. ఏఎస్‌డీడీ కేటగిరి కింద తొలగించిన ఓటర్ల రీఎంట్రీలో ఇప్పటివరకు అనూహ్యమేమి చోటుచేసుకోలేదు. ఇక మిగిలినవి రెండే.. ఒకటి ఆబ్సెంట్, ఇంకొటి షిఫ్టెడ్.. ఈ రెండు అంశాల్లోనే ఎవరైనా ఓటరు వచ్చేందుకు అవకాశం ఉంది. రీఎంట్రీకి ఎన్నికల కమిషన్ అవకాశం ఇచ్చినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. తొలగించిన ఓట్లు ఐదంకెల్లో ఉంటే.. ఇప్పటివరకు సింగిల్ డిజిట్‌లోనే తిరిగి నమోదు జరిగినట్లు తెలుస్తోంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమ (సర్) ప్రక్రియలో భాగంగా ఆగస్టు 2వ వారంలో ఎన్నికల కమిషన్ ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. దాంట్లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ తర్వాత జిల్లాలో ఓటర్ల జాబితాను ప్రకటించడమే కాకుండా శాశ్వతంగా తొలగించిన ఓట్ల సంఖ్యపై కూడా స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదంకెల్లో ఓటర్లను తొలగించడం, ఈ తొలగించిన ఓట్ల విషయంలో రాష్ట్రంలో, దేశంలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఎన్నికల కమిషన్ తొలగించిన ఓట్లకు సంబంధించి ఏయే అంశాల్లో పరిగణలోకి తీసుకున్నారో, వాటి ఆధారంగా మళ్లీ ఏఎస్‌డీడీ రీఎంట్రీకి అవకాశం కల్పించింది. ఇందుకు స్పందన నామమాత్రంగా కనిపిస్తోంది. ఈ గడువును ఇంకా పెంచారు. అయినా పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
ఆ ఓట్లలోనే రీఎంట్రీ అవకాశాలు..
ముసాయిదా ఓటర్ల జాబితాలో శాశ్వతంగా తొలగించిన ఓట్లతో పాటు ఎన్నికల కమిషన్ డిజిటలైజేషన్ పూర్తయిన ఓట్లలోనూ వివిధ అంశాల ఆధారంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో అనామలీస్‌లో భాగంగా లక్షకు పైగా ఓటర్లకు, మ్యాపింగ్‌కు నోచుకోని వారికి వేల సంఖ్యలో ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఏఎస్‌డీడీలో భాగంగా రీఎంట్రీకి అవకాశం కల్పించగా, ఇందులో పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఇక అనామలీస్, నోమ్యాపింగ్ అంశాల్లోనే నోటీసులు అందుకున్న వారిలో స్పందన ఎలా ఉంటుందనేది తుది ఓటరు జాబితాలోనే తేలనుంది. కాగా ఇప్పటివరకు ఈ రెండు అంశాల్లో వేల సంఖ్యలో నోటీసులకు ఓటర్లు స్పందించినట్లుగా తెలుస్తోంది.
వివరాలిలా ..
జూన్ నాటికి ఓటర్ల సంఖ్య 4,66,784
సర్‌లో డిజిటలైజేషన్ పూర్తయినవి 4,03,825
అనామలిస్ నోటీసులు 1,32,833
మ్యాపింగ్ కాని వారు 17,591
శాశ్వతంగా తొలగించిన ఓట్లు 63,159


