లైబ్రరీలు, స్టడీ సర్కిళ్లలో నిరుద్యోగ అభ్యర్థుల తాకిడి ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో సన్నద్ధం అన్ని శాఖల్లో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ అభ్యర్థులు పట్టుదలతో చదువుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా పలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వంటి యూనిఫాం సర్వీసుల నియామక ప్రక్రియకు నోటిఫికేషన్లు వెలువడటంతో గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు అభ్యర్థులతో సందడిగా మారాయి. ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కొందరు ఇంటివద్దే చదువుకుంటుండగా.. మరికొందరు గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లలో గంటల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. యూనిఫాం ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చదువుతోపాటు మైదానాల్లో సాధన చేస్తూ చెమటోడుస్తున్నారు. మరోవైపు డీఎస్సీ, గ్రూప్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న వారు కూడా ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు సైతం ప్రిపరేషన్ ముమ్మరం చేశారు.
నిరుద్యోగుల ముమ్మర కసరత్తులు
ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు అభ్యర్థులు చదువులో నిమగ్నమవుతుండగా.. మరోవైపు శారీరక దారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కానిస్టేబుల్, ఎస్సై వంటి యూనిఫాం సర్వీసులకు నోటిఫికేషన్లు విడుదల కావడంతో వేలాది మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనూ అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
నోటిఫికేషన్లకు డిమాండ్..
ఎస్సై, కానిస్టేబుల్ వంటి యూనిఫాం సర్వీసులకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్న ప్రభుత్వం.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న అటవీ శాఖ, గ్రూప్స్, డీఎస్సీ, జూనియర్ లెక్చరర్, గురుకుల పోస్టుల భర్తీపై కూడా దృష్టి సారించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పటికీ అందులో పేర్కొన్న విధంగా నియామకాలు చేపట్టకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


