ఆదిలాబాద్: కార్తిక ఏకాదశి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ నుంచి పండర్‌పూర్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ.శ్రీధర్ ఒకప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ 07625 ఆదిలాబాద్–పండర్‌పూర్ ప్రత్యేక రైలు ఈ నెల 19, 23 తేదీల్లో రాత్రి 7.15గంటలకు ఆదిలాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు పండర్‌పూర్ చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07626 పండర్‌పూర్–ఆదిలాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 20, 24 తేదీల్లో రాత్రి 8గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు. ఈ రైళ్లు కిన్వట్, బోధాడి బుజుర్గ్, సహస్రకుండ్, హిమాయత్‌నగర్, హడ్గావ్ రోడ్, భోకర్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ, పర్భణి, లాతూర్ తదితర స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. ఏసీ చైర్‌కార్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయని తెలిపారు.
ఆదాయం ఇచ్చే పంటలను ప్రోత్సహించాలి
ఆదిలాబాద్‌టౌన్: గిరిజన రైతులు ఉద్యానవన పంటల సాగు చేపట్టి ఏడాది పొడవునా ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఉద్యానవన శాఖ నర్సరీని సందర్శించారు. షెడ్‌నెట్, నెట్‌హౌస్‌లో సాగు చేస్తున్న మునగ, వెదురు, కరోండా, డ్రాగన్‌ఫ్రూట్ మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మామిడి తోటలో అంతరపంటగా సాగు చేస్తున్న టమాటా పంటను పరిశీలించారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా ఆయిల్‌పామ్, కూరగాయలు, మల్బరీ పంటల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. గిరిజన రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యానవన శాఖ అధికారి అలేఖ్య, సిబ్బంది ఉన్నారు.


