సాక్షి,ఆదిలాబాద్: ఈ నెల 4న ప్రొవిజినల్ జాబితా విడుదల చేసి.. వారంలోపు మెరిట్ జాబితా వెల్లడిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ప్రక్రియ మాత్రం ముందుకు సాగని పరిస్థితి. మరోవైపు సెలవుపై వెళ్లిన కలెక్టర్ రాజర్షిషా తిరిగి వచ్చారు. మంగళవారం తన వద్దకు రావాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మెరిట్ జాబితా విడుదల చేస్తారా.. లేనిపక్షంలో ఇంకా కసరత్తు ఏమైనా చేస్తారా.. అనేది చూడాల్సిందే.
32 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ ప్రక్రియపై..
వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి 32 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీ విషయంలో పూర్తిగా అభాసుపాలైన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియపై నిరుద్యోగ అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రొవిజినల్ జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. అభ్యంతరాలు ఉంటే దరఖా స్తుదారులు తెలియజేయాలని ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి.. అవి ఏంటి.. వాటిని సరిదిద్దారా.. ఇక పోస్టుల భర్తీకి తదుపరి మెరిట్ జాబితా విడుదల చేస్తారా.. అని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రకరకాల ఊహాగానాలు..
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుదారుల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టులను ముందుగా అనుకున్నవారికే ఇస్తారని కొందరు.. ప్రక్రియపై విమర్శలు వ్యక్తం కావడంతో మెరిట్ ప్రకారం ముందుకెళ్లడం ద్వారా సజావుగా ముగిద్దామనే అంశంలోనూ వైద్యారోగ్య శాఖాధికారులు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రక్రియ నిర్వహణపై నోటిఫికేషన్ నుంచి మొదలుకుంటే అన్ని అంశాల్లోనూ వివాదాల నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి నిర్వహించేలా ఏదైన నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా నిరుద్యోగ అభ్యర్థుల్లో చర్చ సాగుతుంది. మొత్తంగా ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాల్సిందే.
జాబితా సిద్ధం చేశాం..
మెరిట్ జాబితా సిద్ధం చేశాం. పూర్తి వివరాలతో మంగళవారం కలెక్టర్‌ను కలవనున్నాం. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం.
– డాక్టర్ సాధన, డీఎంహెచ్‌వో


