హైదరాబాద్‌లో ఆస్తులు.. పింఛన్‌కు దరఖాస్తులు!
కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, గీత కార్మికులకు ఆర్థికభరోసా కల్పించేందుకు చేయూత పథకం కింద సామాజిక పింఛన్లు అందిస్తోంది. కొత్త వాటి మంజూరు కోసం ఇటీవల అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటిని విచారించిన జిల్లా అధికారులు మంజూరుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే జిల్లా నుంచి అందిన దరఖాస్తులను సెర్ప్ అధికారులు 360 డిగ్రీ సాఫ్ట్‌వేర్‌తో పరిశీలించారు. ఇందులో పలువురు దరఖాస్తుదారుల పేరిట హైదరాబాద్‌తో పాటు మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి తదితర రాజధాని సమీప ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లుగా చూపించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇలాంటివి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 2,782 దరఖాస్తుల ను అనుమానాస్పదంగా గుర్తించిన ఉన్నతాధికారులు వాటిపై పునర్‌విచారణకు ఆదేశిస్తూ జిల్లాకు పంపించారు. మండలాల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు వారి పేరిట ఉన్న ఆస్తుల వివరాలు చూసి విస్తుపోతున్నారు.
నిజనిర్ధారణకు ప్రత్యేక విచారణ..
వివిధ రకాల కేటగిరీల్లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆధార్‌కార్డు ఆధారంగా సెర్ప్ ఉన్నతాధికారులు 360 డిగ్రీ సాఫ్ట్‌వేర్‌తో పరిశీలించారు. ఆ నంబర్లతో సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల(ధరణి, భూమాత పోర్టల్)లో వ్యవసాయ భూములు, ప్లాట్లు వంటివి భారీగా నమోదై ఉన్నట్లుగా గుర్తించారు. అలాంటి దరఖాస్తులను అనుమానాస్పదంగా గుర్తించి, జిల్లాకు పంపి విచారణకు ఆదేశించారు. ఈమేరకు ఆయా దరఖాస్తులపై ఎంపీడీవోలు, ఎంపీవోలు క్షేత్రస్థాయిలో ప్రత్యేక విచారణ చేపడుతున్నారు. సదరు దరఖాస్తుదారుల పేరిట వాస్తవంగానే ఆస్తులు ఉన్నాయా.. లేక ఎక్కడైనా పొరపాటు జరిగిందా అనేదానిపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. వారి పేరిట ఆస్తులు కలిగి ఉంటే తొలుత ఏ విధంగా విచారణ చేపట్టి సిఫారసు చేశారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది వరకు విచారణ చేపట్టి ఆమోదం తెలిపిన అధికారులకే తిరిగి విచారణ బాధ్యతలు అప్పగించినట్లయితే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు భారీగా ఆస్తులున్న వారు సైతం పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వారి ఆధార్‌తో ఎవరైనా బినామీలుగా రిజిస్ట్రేషన్ చేయించారా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. ప్రత్యక్ష విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగితేనే ఇది సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
విచారణతో వెలుగులోకి..
సెర్ప్ ఉన్నతాధికారుల నుంచి అందిన అనుమానాస్పద పింఛన్ దరఖాస్తులను ఆయా మండలాల అధికారులకు పంపించాం. వారు క్షేత్రస్థాయి విచారణ చేపడుతున్నారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఆ నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటాం.
– జాదవ్ శేష్‌రావు, డీపీఎం పింఛన్
మండలాలా వారీగా అనుమానాస్పద దరఖాస్తులు
మండలం దరఖాస్తులు
ఆదిలాబాద్‌రూరల్ 147
ఆదిలాబాద్‌అర్బన్ 510
బజార్‌హత్నూర్ 129
బేల 111
భీంపూర్ 122
భోరజ్ 88
బోథ్ 118
గాదిగూడ 69
గుడిహత్నూర్ 121
ఇచ్చోడ 237
ఇంద్రవెల్లి 154
జైనథ్ 92
మావల 24
నార్నూర్ 75
నేరడిగొండ 152
సాత్నాల 22
సిరికొండ 66
సొనాల 44
తలమడుగు 189
తాంసి 87
ఉట్నూర్ 235


