రైతుకు భరోసానిచ్చేలా | - | Sakshi
Sakshi News home page

రైతుకు భరోసానిచ్చేలా

Nov 11 2026 12:43 AM | Updated on Nov 11 2026 12:43 AM

● కరువు మండలాల్లో పంట నష్ట నిర్ధారణ ● సర్వే షురూ చేసిన వ్యవసాయ శాఖ ● రుణాల రీషెడ్యూల్‌కు కలెక్టర్‌ ఆదేశం

కై లాస్‌నగర్‌: ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతన్నకు ఎల్‌నినో రూపంలో వచ్చిన కరువు తీవ్రనష్టాన్ని మిగిల్చింది. వర్షాభావ పరిస్థితులతో వానాకాలంలో సాగు చేసిన పంటల దిగుబడి సగానికి సగం పడిపోయిన దుస్థితి. కనీసం పెట్టుబడులు సైతం చేతికందని పరిస్థితి. ఈ క్రమంలో బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 21 మండలాలకు గాను 20 మండలాలను కరువుగా ప్రకటించింది. రైతులకు భరోసా కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టే దిశగా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే వ్యవసాయశాఖ పంట నష్ట నిర్ధారణ సర్వే ప్రారంభించగా, రుణాల రీషెడ్యూల్‌కు కలెక్టర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

మొదలైన పంట నష్ట నిర్ధారణ సర్వే..

జిల్లాలో 101 క్లస్టర్ల పరిధిలో పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఏవో పర్యవేక్షణలో ఏఈవోలకు సర్వే బాధ్యతలను అప్పగించింది. వీరంతా ఆయా మండలాల్లో రైతులు సాగు చేసిన పంట చేలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. నష్టాన్ని అంచనా వేసి రైతు భరోసా క్రాప్‌ బుకింగ్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 13 మండలాల్లో తొమ్మిది వేల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ప్రభుత్వ ఆదేశానుసారం నష్టం 33శాతం కంటే ఎక్కువగా ఉంటేనే నష్టపోయినట్లుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. త్వరలోనే ప్రక్రియ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. తదనుగుణంగా చర్యలు చేపట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

రుణాల రీషెడ్యూల్‌ కూడా..

జిల్లాలో 1.65లక్షల మంది రైతులు పట్టాపాస్‌బుక్‌లు కలిగి ఉన్నారు. ఇందులో వానాకాలం సీజన్‌కుగాను 1.12లక్షల మంది పంట రుణాలు తీసుకున్నారు. ఈ సీజన్‌లో రూ.2,909 కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్దేశించగా రూ.1,480 కోట్లు అందజేశారు. జిల్లాలోని 20 మండలాలను కరువుగా ప్రకటించిన నేపథ్యంలో రైతులు తీసుకున్న పంట రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఇటీవల బ్యాంకర్లను ఆదేఽశించిన విషయం తెలిసిందే. రీషెడ్యుల్‌ ద్వారా పంట రుణాల చెల్లింపు గడువు మూడేళ్ల పాటు పెరగనుండగా, కొత్తవి పొందేందుకు అవకాశం ఏర్పడనుంది. ఇది రైతులకు కలిసొచ్చే అంశం కానుండగా దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సిన అవసరముందని బ్యాంకింగ్‌ అధికారులు చెబుతున్నారు.

ఉత్తర్వులు రావాల్సి ఉంది

రైతుల పంట రుణాల రీషెడ్యూల్‌కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అయితే ఏవిధంగా షెడ్యూల్‌ చేయాలనే దానిపై ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన ఉత్తర్వులు రావాల్సి ఉంది. రాష్ట్రస్థాయి ఎస్‌ఎల్‌బీసీ సమావేశం సోమవారం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ సమావేఽశం అనంతరం జిల్లాలో తగు చర్యలు తీసుకుంటాం.

– ఉత్పల్‌కుమార్‌, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌

నిష్పక్షపాతంగా సర్వే

ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా జిల్లాలో పంట నష్ట నిర్ధారణ సర్వే ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నాం. ప్రతి పంట చేనును ఏఈవోలు పరిశీలించి నష్టాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. సర్వేను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. తదుపరి ఆదేశాలకనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్‌స్వామి,

జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి

జిల్లాలో

మొత్తం రైతులు : 1.65 లక్షలు

రుణాలు పొందిన వారు : 1.12 లక్షలు

మంజూరు చేసిన రుణాలు : రూ.1,470 కోట్లు

పంటల సాగు విస్తీర్ణం : 5.94 లక్షల ఎకరాలు

ప్రభుత్వం ప్రకటించిన

కరువు మండలాలు : 20

పంట నష్టం సర్వేలో పాల్గొంటున్న ఏవోలు : 19 మంది, ఏఈవోలు : 90 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement