పోస్టులు అమ్మేశారా..!? | - | Sakshi
Sakshi News home page

పోస్టులు అమ్మేశారా..!?

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీలో వైద్యారోగ్యశాఖ అభాసుపాలు నోటిఫికేషన్‌లో కొన్ని పోస్టులు తగ్గించారనే విమర్శలు రూ.లక్షల్లో చేతులు మారాయనే ఆరోపణలు పారదర్శకమంటూనే సమాధానం ఇవ్వలేకపోతున్న అధికారులు

సాక్షి,ఆదిలాబాద్‌: ఇటీవల వైద్యారోగ్య శాఖ పలు క్యాడర్లకు సంబంధించి 26 కాంట్రాక్ట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులందరికీ ఆ పోస్టుల సంఖ్య అంతేనని అనుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసి ప్రొవిజినల్‌ జాబితా విడుదల చేసే సమయంలో ‘సాక్షి’ ఈ పోస్టుల సంఖ్య విషయంలో వైద్యారోగ్యశాఖ అధికారులను అడిగినప్పుడు 32 పోస్టులు నింపుతున్నట్లు సమాధానం చెప్పారు. మొదటి నోటిఫికేషన్‌ తర్వాత మరో నోటిఫికేషన్‌ జారీ చేసి మిగతా పోస్టులకు సంబంధించి ప్రకటించినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే వెబ్‌సైట్‌లో మా త్రం మరో నోటిఫికేషన్‌ లేకపోవడం గమనార్హం. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు నోటిఫికేషన్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులు 5 ఖాళీలను భర్తీ చేస్తున్నట్టుగా వెల్లడించారు. అభ్యర్థులు మాత్రం ఈ పోస్టులు తొమ్మిది ఉండగా, వాటిని తగ్గించి చూపించా రని బాహాటంగానే ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్‌లో పోస్టులు తగ్గించి ప్రకటించడం వెనుక మతలబు ఏమై ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.3లక్షల నుంచి రూ.7లక్షల వరకు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

అభాసుపాలు..

వైద్యారోగ్య శాఖలో ఎన్‌హెచ్‌ఎం పరిధిలో వివిధ కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన ప్రక్రియ పూర్తిగా అభాసుపాలైంది. నోటిఫికేషన్‌ నుంచి మొదలుకుంటే అన్ని ప్రక్రియల్లో ఈ శాఖ అధికారులపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నా సరై న వివరణ ఇవ్వకుండా కేవలం పారదర్శకంగా ప్రక్రి య నిర్వహిస్తున్నామని చెప్పుకోవడమే తప్పిస్తే ఎత్తిచూపిన లోపాల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

అంతా గప్‌చుప్‌..

పూర్తిగా పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తున్నామని, నిరుద్యోగ అభ్యర్థులు అపోహలను నమ్మవద్దని డీఎంహెచ్‌వో సాధన, ఏవో నందిత ఇటీవల కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పారు. ఆ తర్వాత ఈ పోస్టుల సంఖ్య విషయంలో రెండు రోజులుగా ‘సాక్షి’ క్యాడర్‌ వారీగా ఎన్ని ఉన్నాయో వివరాలు తెలుపాలని కోరినప్పటికీ ఈ ఇద్దరు అధికారుల నుంచి అసలు స్పందనే కరువైంది. ఫోన్‌లో అందుబాటులోకి రావడం లేదు.

ఎవరిదీ పాత్ర..

వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షణలో అసలు ఎవరి పాత్ర కొనసాగుతుందనే విషయంలో నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుల సంఖ్యను తగ్గించి చూపడం, లోలోపలే వీటిని భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వ్యక్తం కావడం, రోస్టర్‌ ప్రకారం మెరిట్‌ ఆధారంగా పైకి జాబ్‌లు ఇస్తామని చెబుతున్నప్పటికీ చివరి వరకు అసలు ఈ పోస్టులు అర్హులైన వారికి దక్కుతాయా.. లేదా అనే అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో డీఎంహెచ్‌వో సాధనను ‘సాక్షి’ సంప్రదించేందుకు యత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement