కై లాస్నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణిపై దీపావళి పండుగ ప్రభావం కనిపించింది. ప్రతీ సోమవారం అర్జీదారులతో కిటకిటలాడే గ్రీవెన్స్ ఈ వారం మాత్రం వెలవెలబోయింది. అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, చిత్రు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి, భూ సంబంధ, ఇతర సమస్యలపై జిల్లాస్థాయిలో 11అర్జీలు, మండలస్థాయిలో మరో 9 మాత్రమే అందాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దరఖాస్తులను పరిశీలించి సత్వరం పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. 30 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న వాటిని గుర్తించి, తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో స్రవంతి, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


