సర్కారు బడుల్లో ఖర్చు చేయకముందే సమర్పణ
దుకాణ యజమానులతో కొందరు టీచర్ల మిలాఖత్
స్పోర్ట్స్ గ్రాంట్స్ మింగేస్తున్న వైనం
విద్యార్థులకు తీవ్ర నష్టం
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడులకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకముందే బిల్లులు సమర్పించాలని విద్యా శాఖాధికారులు అడగడంతో ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్త నిబంధనలతో బిల్లులు సమర్పించేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ బిల్లుల నగదు మొత్తాన్ని వస్తువులు కొనుగోలు చేసే యజమాని అకౌంట్‌లో జమ చేయనున్నారు. దీంతో కొంత మంది ఉపాధ్యాయులు సంబంధిత దుకాణ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కొంత కమీషన్ ఇచ్చి మిగతా డబ్బులు కాజేసేందుకు పన్నాగం పన్నుతున్నట్లు తెలుస్తోంది.
కొనుగోలుకు ముందే బిల్లులు..
ప్రభుత్వం ఏటా పాఠశాలలకు స్కూల్‌గ్రాంట్స్, స్పోర్ట్స్ గ్రాంట్స్ కేటాయిస్తుంది. ఇదివరకు పీఎఫ్ ఎంఎస్ ఉండగా, కొత్తగా సీఎఫ్‌ఎంఎస్ స్పర్శ్ విధానాన్ని తీసుకొచ్చింది. గతనెలలో స్కూల్ గ్రాంట్స్ విడుదలయ్యాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 30 లోపు విద్యార్థులు ఉంటే రూ.10వేలు స్కూల్ గ్రాంట్, రూ.5వేలు స్పోర్ట్స్ గ్రాంట్, 35 కంటే ఎక్కువగా ఉంటే రూ.25వేలు స్కూల్ గ్రాంట్, 100 కంటే ఎక్కువగా ఉంటే రూ.50వేల స్కూల్ గ్రాంట్ విడుదల చేసింది. ఈనెల 12లోగా బిల్లులు సమర్పించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హడావుడిగా ఉపాధ్యాయులు ఆయా దుకాణాలకు వెళ్లి జీఎస్టీ, సాధారణ బిల్లుల కోసం వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది బిల్లులను స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో పాటు డీడీవోలకు సమర్పించారు. వారు ఆన్‌లైన్‌లో పొందుపర్చి ట్రైజరీకి పంపించారు. అయితే ఆ నిధులు సంబంధిత దుకాణ యజమాని ఖాతాలో జమ అయిన తర్వాతే వస్తువులను ఆయా పాఠశాలలకు అందించే అవకాశం ఉంది. ఇదివరకు స్కూల్ గ్రాంట్స్ మార్చి 31 వరకు సమర్పించే అవకాశం ఉండేది. వచ్చే విద్యా సంవత్సరంలో ఆడిట్ ఉండేది. కొత్త నిబంధనలతో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది.
కొత్త నిబంధనలతో తంటాలు..
స్కూల్, స్పోర్ట్స్ గ్రాంట్స్‌కు సంబంధించిన ప్రభుత్వ కొత్త నిబంధనలతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. మొదట పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీతో తీర్మానం చేయాలి.. షాప్ పేరిట ప్రొసిడింగ్ తీయాలి.. సంబంధిత షాప్ నుంచి అడ్వాన్స్ పేమెంట్, ఎకనాలెడ్జ్‌మెంట్, క్యాష్ రిసిప్ట్ తీసుకొని ఐఎఫ్‌ఎంఎస్‌లో పొందుపర్చాలి.. ఇందులో జీఎస్టీ బిల్లు సమర్పించాల్సి ఉంటుంది.. ఆ తర్వాత సంబంధిత దుకాణ యజమాని ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఆ తర్వాత యజమాని నుంచి వస్తువులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేజీబీవీ, మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన స్కూల్ గ్రాంట్స్ డీఈవో అకౌంట్‌లో జమ చేశారు. బిల్లులు సమర్పిస్తే ఆ పాఠశాలలకు డీఈవో అకౌంట్ నుంచి నిధులు అందించనున్నారు. ఈ విషయమై జిల్లా విద్యా శాఖ అధికారి మాధవిని వివరణ కోరగా, ఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు సమర్పించాలని తెలిపారు. సంబంధిత దుకాణ యజమాని ఖాతాలోనే డబ్బులు జమ అవుతాయి. ఖచ్చితంగా వస్తువులు కొనుగోలు చేయాలని, అక్రమాలకు పాల్పడినట్లే తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
కొత్త విధానంతో హెచ్‌ఎంల అవస్థలు


