ఆదిలాబాద్‌టౌన్: విద్యుత్ వినియోగదారులపై ఆ శాఖ బాదుడు మొదలుపెట్టింది. ట్రూఅప్ పేరిట అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి మేరకు డి స్కమ్‌లు ఈనెల నుంచే బిల్లులతో పాటు అదనపు వసూళ్లు ప్రారంభించాయి. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఈనెలలో యూనిట్ కు 30 పైసల చొప్పున, వచ్చే నెల నుంచి 50 పైసల చొప్పున 26 నెలల పాటు ఈ వసూళ్లు కొనసాగనున్నాయి. ఒక్కో వినియోగదారుడికి రూ.150 నుంచి రూ.300 వరకు నెలకు అదనపు భారం పడనుంది.
ట్రూఅప్ చార్జీల పేరిట..
2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన అదనపు వ్యయం, రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు విద్యుత్ శాఖ ఈ ట్రూఅప్ చార్జీలు వసూలు చేస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వం భరించనుంది. 26నెలల పాటు ఈవసూళ్లు కొనసాగనున్నాయి. గడిచిన రెండేళ్లలో వినియోగదారుడు ఎన్ని యూని ట్లు వాడాడో వాటికి అనుగుణంగా ఒక్కో యూనిట్‌ౖ పె ఈనెలలో 30పైసలు, వచ్చే నెలలో 50 పైసల చొప్పున వసూలు చేయనున్నారు.
వినియోగదారుల్లో ఆందోళన
మూడు నాలుగేళ్ల క్రితం విద్యుత్ వినియోగానికి, ఇప్పుడు డబ్బులు అదనంగా కట్టడమంటే ఏమిటని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయని, ట్రూఅప్ పేరిట ఆ శాఖ అదనంగా బాదడంపై మండిపడుతున్నారు. గృహ జ్యోతి మినహా మిగతా కేటగిరీల వారు 100 యూనిట్లు వినియోగిస్తే ఈనెలలో అదనంగా రూ.30, వచ్చే నెల నుంచి రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 200 యూనిట్లు వాడే వారికి ఈనెలలో రూ.60, వచ్చే నెల నుంచి రూ.120, 300 యూనిట్లు వాడే వారికి ఈనెలలో రూ.90, వచ్చే నెల నుంచి రూ.150 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 26 నెలలకు సంబంధించి 300 యూనిట్లు వాడే వినియోగదారుడిపై దాదాపు రూ.4వేల వరకు అదనపు భారం పడనుంది. 26 నెలలకు సంబంధించి నెలకు 300 యూనిట్లు వాడే వినియోగదారుడిపై దాదాపు రూ.4వేల వరకు అదనపు భారం పడనుంది.
వినియోగదారులు
వాడిన విద్యుత్‌కే..
2022–23, 2023–24 సంవత్సరాల్లో విని యోగదారులు వాడిన విద్యుత్‌కే ట్రూ అప్ చార్జీలు వసూలు చేస్తున్నాం. ప్రజలపై ఎలాంటి అదనపు భారం మోపడం లేదు. టీజీఈఆర్‌సీ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన విద్యుత్ ఖర్చు, రెవెన్యూ లోటును సర్దుబాటు చేయడం జరుగుతుంది. యూనిట్‌కు ఈ నెలలో 30పైసలు, వచ్చే నెలలో రూ.50పైసల చొప్పున 26 నెలల పాటు వీటిని చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్‌ను వృథా చేయకుండా పొదుపు చేయడాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలి. 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి వినియోగదారులు కూడా ఈచార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
– జాదవ్ సుభాష్, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
200 యూనిట్లు దాటితే ‘గృహజ్యోతి’కి కూడా..
గృహజ్యోతి వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా, లిమిట్ దాటితే ట్రూఅప్ చార్జీలతో పాటు ఆ నెలలో వచ్చే కరెంటు బిల్లులు వసూలు చేయనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత కారణంగా ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో గృహజ్యోతి వినియోగదారులు కూడా పరిమితి దాటి సాధారణ కేటగిరి–1లోకి వస్తున్నారు. దీంతో వారికి కూడా ట్రూఅప్ భారం పడుతుంది.


