సాక్షి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధమైంది. దీపావళి మరుసటి రోజు ఈనెల 9న ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిని ప్రారంభించనున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ముఖ్య ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ మే రకు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ, తెలంగాణ పారిశ్రామి క మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నుంచి ప్రకటన జారీ అయ్యింది. హైదరాబాద్ టీజీఐఐసీ లిమిటెడ్ చీఫ్ ఇంజినీర్ ఎం.నరేందర్‌రెడ్డి, నిజామాబాద్ జోనల్ మేనేజర్ ఎం.శివప్రసాద్ నుంచి ఇందుకు సంబంధించి ఆహ్వాన పత్రిక జారీ చేశారు.
రూ.54 కోట్లతో నిర్మాణం పూర్తి
మావల మండలం బట్టిసావర్గాంవ్ వద్ద జాతీయ రహదారి 44ను ఆనుకుని మూడెకరాల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నోడల్ ఏజెన్సీగా ప్రాజెక్ట్ పనులు జరిగాయి. 65వేల చదరపు అడుగుల వైశాల్యంలో జీప్లస్ 4 అంతస్తుల్లో దీనిని నిర్మించారు. 2022–23 సంవత్సరంలో నిర్మాణం మొదలైంది. అంచనా వ్యయం రూ.43 కోట్ల నుంచి రూ.54 కోట్లకు చేరుకుంది. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఆధునిక వర్క్ స్టేషన్లను సిద్ధం చేశారు. ఒక్కో షిఫ్ట్‌లో 660 మంది పనిచేసే సామర్థ్యముంది. మూడు షిఫ్టుల్లో కలిపి దాదాపు 2వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. సెంట్రలైజ్డ్ ఏసీ, కాన్ఫరెన్స్ హాల్ అండ్ మీటింగ్ హాళ్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, క్యాంటీన్, రెస్ట్ రూంలు, విశాలమైన పార్కింగ్, లిఫ్ట్ వసతులు కల్పిస్తున్నారు.
మరిన్ని కంపెనీలతోనూ..
ఇప్పటికే ఆదిలాబాద్ కేంద్రంగా రెండు కంపెనీలు ఐటీ సేవలు అందిస్తున్నాయి. ఎన్‌టీటీ డాటా సొ ల్యూషన్స్ (300 పొజిషన్‌కు అవకాశం), ఎన్‌ల్యాబ్స్ (150 పొజిషన్‌కు అవకాశం) కంపెనీలతో ఎంవోయూలు ఇదివరకే చేసుకున్నాయి. ఐటీ టవర్ ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్, ఇతర ప్ర ధాన నగరాల నుంచి బీపీవో, ఐటీ అనెబుల్ట్ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విభాగాలకు చెందిన మరిన్ని మధ్యస్థాయి కంపెనీలు ఆదిలాబాద్‌ను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, మౌలిక సదుపాయాల వెసులుబాటు కల్పిస్తోంది. ప్రారంభం నుంచి మూడేళ్ల వరకు కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు అద్దె రాయితీలు కల్పిస్తోంది.
టైర్–2 ప్రాంతంలో..
రాష్ట్రంలో హైదరాబాద్ ప్రధాన ఐటీ హబ్ కాగా, ఈ సేవలు అక్కడికే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి (టైర్–2, టైర్–3) నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్‌లు, ఐటీ టవర్లను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఇప్పటికే ఐటీ టవర్లు ఏర్పాటు చేసి సేవలు విస్తరించింది. తాజాగా ఆదిలాబాద్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. స్థానిక పట్టణాల నుంచి వచ్చే సాంకేతిక నైపుణ్యం కలిగిన యువత, గ్రాడ్యుయేట్లను ఈ సంస్థలు ఇప్పటికే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. రానున్న కంపెనీలు కూడా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనే అభిప్రాయం జిల్లావాసుల్లో వ్యక్తమవుతోంది.


