కైలాస్‌నగర్: వర్షపునీటిని ఒడిసిపట్టి, భూగర్భజ లాలను భూమిలోకి ఇంకించేలా ఆదిలాబాద్ ము న్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. వర్షపునీరు భారీగా నిల్వ ఉండటంతో పాటు పారుదల ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారీ ఇంకుడుగుంతలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్–2 కింద రూ.50 లక్షల ప్రత్యేక నిధులు కేటాయించింది. శాటిలైట్ ద్వారా ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో ఈ నిర్మాణా లు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్ త్వరలోనే ప నులు ప్రారంభించనున్నారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో భూగర్భజలమట్టం పెరిగి సమీపంలోని బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడనుంది.
ఒక్కో నిర్మాణానికి రూ.5లక్షలు
రోజురోజుకూ విస్తరిస్తున్న మున్సిపాలిటీలో కాంక్రీట్ నిర్మాణాల సంఖ్య పెరుగుతోంది. దీంతో వర్షపునీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగినంత కురవకపోవడం, నీటి వినియోగం అధికంగా పెరగడంతో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో భవిష్యత్‌లో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేలా, వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేలా బల్దియా అధికారులు భారీ ఇంకుడుగుంతలు నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో దాన్ని రూ.5లక్షల వ్యయంతో మూడు ఫీట్ల లోతు, మూడు ఫీట్ల వెడల్పుతో నిర్మించనున్నారు. భూమిలోని 100 మీటర్ల వరకు భూగర్భజలాలు వేగంగా ఇంకేలా ప్రత్యేకంగా బోర్లు వేయనున్నారు. వాటికి పీవీసీ పైపులను ఏర్పాటు చేస్తారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక నమూనా ప్రకారం పనులు చేపట్టనున్నారు.
ఎంపిక చేసిన ప్రాంతాలివే..
ఇటీవల పట్టణంలో పర్యటించిన కేంద్ర ప్రత్యేక బృందం వర్షపునీరు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా భూమిలోకి ఇంకించగలమనే దానిపై ప్రత్యేక అధ్యయనం చేసింది. శాటిలైట్ ద్వారా సర్వే చేసిన బృందం పట్టణ పరిధిలోని 10 చోట్ల నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఇంకుడుగుంత నిర్మాణం ఎలా చేపట్టాలనేదానిపై ప్రత్యేక డిజైన్ రూపొందించింది. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలను నిర్మాణాల కోసం ఎంపిక చేశారు. పట్టణంలోని ప్రభుత్వ డైట్ కళాశాల, మున్సిపల్ కార్యాలయం, ఫిల్టర్ బెడ్, డీఈవో కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల ఆవరణ, కలెక్టరేట్ ప్రాంగణం, జిల్లా కోర్టు కాంప్లెక్స్, స్టేడియంలోని స్పోర్ట్స్ స్కూల్, గాంధీ పార్కు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో భారీ ఇంకుడుగుంతలు నిర్మించనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించారు. 10శాతం లెస్‌తో దాఖలు చేసిన పట్టణానికి చెందిన ఆయ్యప్ప కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీకి పనులు అప్పగించారు. అగ్రిమెంట్ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో పనులు చేపట్టేందకు కాంట్రాక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి నిర్మాణాల కోసం ఇటీవల ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ డైట్ కళాశాల వద్ద భూమిపూజ చేశారు. త్వరలో ఇంకుడుగుంతల పనులు ప్రారంభం కానున్నాయి.
100 ఫీట్ల లోతుకు జలం ఇంకేలా..
వర్షపునీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో పాటు ఎక్కువగా పారే ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు నిర్మిస్తున్నాం. గంట వ్యవధిలో అత్యంత వేగంగా వంద మీటర్ల లోతుకు జలం ఇంకేలా కేంద్రం నిర్దేశించిన ప్రత్యేక డిజైన్ల మేరకు నిర్మాణాలు చేపడతాం. నీరు భూమిలోకి చేరేలా ప్రత్యేక బోర్లూ వేస్తాం. త్వరలోనే పనులు ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేసేలా చూస్తాం.
– అరుణ్‌కుమార్,
మున్సిపల్ ఇంజినీర్, ఆదిలాబాద్


