ఆదిలాబాద్‌టౌన్: ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 5గంటల నుంచే ఆదిలాబాద్, ఉట్నూర్ పోలీస్ డివిజన్ల పరిధిలోని అనుమానితుల ఇళ్లలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. 90మందిని పరీక్షించిన అధికారులు 57 మంది గంజాయి సేవించినట్లు నిర్ధారించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే వాట్సాప్ నంబర్ 87126 59973కు సమాచారం అందించాలని డీఎస్పీ జీవన్‌రెడ్డి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించారు.


