ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పార్ట్–2 పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని గోదాములకు చేరగా, వాటిని ఆయా మండలాల్లోని ఎమ్మార్సీలకు విద్యాశాఖ సరఫరా చేస్తోంది. రెండు, మూడు రోజుల్లో పాఠశాలలకు పూర్తిస్థాయిలో సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో పార్ట్–1కు సంబంధించి జిల్లాకు 4లక్షల 80వేల 700 పాఠ్య పుస్తకాలు వచ్చాయి. ఈ పుస్తకాల్లో సెప్టెంబర్ వరకు సిలబస్ ఉంది. అక్టోబర్ నుంచి పార్ట్–2కు సంబంధించిన సిలబస్ ప్రారంభం కావాల్సి ఉంది. అయి తే పుస్తకాల సరఫరా నెల ఆలస్యమైంది. ప్రస్తుతం జిల్లాకు చేరడంతో త్వరలోనే తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి వచ్చే నెల నుంచి సిలబస్ బోధించనున్నారు.
లక్ష 29వేల పుస్తకాలు..
జిల్లాలో మొత్తం 1,439 ప్రభుత్వ యాజమాన్య పా ఠశాలలు ఉన్నాయి. ఇందులో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా పార్ట్–1, పార్ట్–2గా పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో పార్ట్–1కు సంబంధించి జిల్లాకు 4లక్షల 80వేల 700 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీటిని సరఫరా చేశా రు. ఇందులో 2వ తరగతి నుంచి 10వ తరగతి వి ద్యార్థులకు లాంగ్వేజ్ పుస్తకాలు మినహా మిగతా వాటిని సెప్టెంబర్ వరకు బోధించాల్సిన పాఠ్యాంశాలు ఉన్నాయి. అక్టోబర్ నుంచి పార్ట్–2 పుస్తకాలు అందించాల్సి ఉంది. అయితే నెల ఆలస్యమైంది. తాజాగా తెలుగు, ఉర్దూ మీడియంకు సంబంధించిన అన్ని ఆప్షనల్ సబ్జెక్టుల పుస్తకాలు వచ్చాయి. మొత్తం లక్ష 29వేల పాఠ్య పుస్తకాలు గోదాములకు చేరుకోగా, వాటిని పాఠ్య పుస్తకాల మేనేజర్ ఆయా మండలాలకు సరఫరా చేశారు. మండల విద్యాధికారుల నుంచి సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా..
సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తుండడంతో పాఠ్య పుస్తకాల్లో బైలింగ్వల్ ముద్రిస్తున్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఓ వైపు తెలుగు, మరోవైపు అదే పాఠ్యాంశాన్ని ఆంగ్లంలో ముద్రించారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉర్దూతో పాటు ఇంగ్లిష్ పాఠ్యాంశాలను ముద్రించారు. విద్యార్థులు పాఠ్యాంశాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
మండలాలకు పంపిణీ చేశాం..
పార్ట్–2కు సంబంధించి జిల్లాకు లక్ష 29వేల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటిని అన్ని మండలాలకు సరఫరా చేశాం. సంబంధిత ఎంఈవోలు వారి పరిధిలోని పాఠశాలలకు పంపిణీ చేయాలి. – సత్యనారాయణ,
పాఠ్య పుస్తకాల గోదాం మేనేజర్


