ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు నల్ల శివన్న ఆధ్వర్యంలో గురువారం శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ గార్డు విభాగాలకు చెందిన పలువురు కార్మికులు ఏఐటీయూసీలో చేరగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం దేవేందర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరా రు. మహాలక్ష్మి మ్యాన్‌పవర్ ఏజెన్సీకి చెందిన కొందరు సూపర్వైజర్లు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు ఖాసీం, ఇర్ఫాన్ ఖాన్ తదితరులున్నారు.


