భైంసా: గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ బ్యారేజీ గేట్లను గురువారం కిందికి దించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇంజినీర్ల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తిచేశారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), మహారాష్ట్ర నీటిపారుదల శాఖ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు, ప్రతినిధులు పాల్గొని ప ర్యవేక్షించారు. కేంద్ర జల సంఘం హైదరాబాద్ అ ప్పర్ గోదావరి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. చరణ్, నాందేడ్ ఇరిగేషన్ డివిజన్ (నార్త్) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీఆర్ బన్సోడ్, ఎస్సారెస్సీ పోచంపాడ్ డ్యామ్సైట్ డివిజన్–1 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కొత్త రవి, రిక్కీ సైమన్ పాల్గొన్నారు.
గోదావరి జలాల నిర్వహణలో కీలకం
బాబ్లీ బ్యారేజీకి ఎస్సారెస్పీ జలాల లభ్యత, గోదావరి నీటి నిర్వహణపరంగా ప్రాధాన్యం ఉంది. గతంలో వివాదాలు తలెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గేట్ల నిర్వహణ చేపడుతున్నారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం కారణంగా జలాశయాల్లో నీటి నిల్వలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో గేట్ల దించివేత అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.


