జిల్లాలో పత్తి ధర డౌన్
పక్షం రోజుల్లోనే పరిస్థితి తారుమారు
రేటు పెరుగుతుందన్న రైతుల ఆశలపై నీళ్లు
‘మద్దతు’కు చేరువైన ప్రైవేట్ ధర
సాక్షి, ఆదిలాబాద్: అక్టోబర్ 22న ఆదిలాబాద్ మా ర్కెట్‌లో పత్తికొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రైవేట్ వ్యాపారులు వేలంలో నాణ్యమై న పత్తి క్వింటాల్‌కు రూ.9,260 ఇస్తామని చెప్పడంతో జిల్లా రైతుల్లో హర్షం వ్యక్తమైంది. బహిరంగ మార్కెట్‌లో మరింత ధర పెరగవచ్చని సంకేతాలు రావడంతో ఈసారి దిగుబడి తగ్గినా ధర కొంత ఆదుకుంటుందని అందరిలో ఆశలు రేకేత్తాయి. పక్షం రో జులకే వారి ఆశలపై నీళ్లు చల్లినట్‌లైంది. శనివారం క్వింటాల్ ధర రూ.8,680 పలికింది. ఇది మొదటి రోజు ధరతో పోలిస్తే ఏకంగా రూ.580 తక్కువ. ప్రస్తుతం మద్దతు ధరకు చేరువైన నేపథ్యంలో ఇక సీసీఐ కీలకంకానుంది.
బహిరంగ మార్కెట్‌లో ఇలా..
బహిరంగ మార్కెట్‌లో పత్తి ధరలను క్యాండి (356 కిలోల దూది), సీడ్ ధరలు శాసిస్తాయి. జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనప్పుడు ఒక క్యాండి ధర రూ.66వేలకు పైబడి పలుకగా ప్రస్తుతం రూ. 56,500 వరకు ఉన్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబు తున్నాయి. అలాగే పత్తి గింజల ధర క్వింటాల్‌కు మొదట్లో రూ.9,120 పలుకగా, ప్రస్తుతం రూ.500 వరకు తగ్గింది. కేంద్రం ప్రకటించిన సీసీఐ మద్దతు ధర రూ.8,667 కాగా , ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్ ధర దానికి చేరువైంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో పత్తికొనుగోళ్లు ప్రారంభమైన రోజు మద్ద తు ధర మించి బహిరంగ మార్కెట్‌లో ధర ఉండటంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలపై ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. వారు మార్కెట్‌లో నామమాత్రంగా అందుబాటులో ఉన్నారు. ప్రైవేట్‌లో మాత్రం ఇ ప్పటి వరకు 63,651 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. పక్షం రోజుల్లో ఈ పత్తి అమ్మకాలు అతి స్వల్పం. ఆదిలాబాద్ మార్కెట్‌లో గతంలో ఒక్కరోజే వేల క్వింటాళ్ల చొప్పున కొద్ది రోజుల్లోనే లక్ష క్వింటాళ్లకుపైబడేది. అలాంటిది ఈసారి మార్కెట్ పూర్తిగా అ మ్మకాలు లేకబోసిపోయింది. మరోవైపు సరైన దిగుబడులు లేక చేతికందిన కొద్ది పాటి పత్తిని రైతు నిల్వ చేసి ధర పెరిగితే అమ్ముదామని ఆశించాడు. కొంతమంది తమ వద్దకే వచ్చిన మహారాష్ట్ర వ్యాపారులకు విక్రయించేశారు. దీంతోఆదిలాబాద్ మార్కె ట్‌లో ఇప్పటి వరకు పెద్దగా కొనుగోళ్లు జరగలేదు.
పరిస్థితి మారేనా ..
జిల్లాలో సీసీఐ 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు అ వసరం ఏర్పడకపోవడంతో వాటిపై అధికార యంత్రాంగం కూడా అంతగా దృష్టి సారించలేదు. మారిన పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్‌లో పత్తి ధర పడిపోవడంతో సీసీఐ కొనుగోలు అనివార్యంగా కనిపిస్తోంది. మరోవైపు ఆదిలాబాద్‌ను మినహాయిస్తే జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీపావళి తర్వాత విక్రయాలు కొంత ఊపందుకునే అవకాశం ఉంది. సీసీఐ కొనుగోలు చేస్తేనే ఇప్పుడు రైతుకు ఆసరాగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది.
ఆ జిన్నింగ్‌ల్లో కొనగోళ్లు ..
సీసీఐ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సంబంధించి 33జిన్నింగ్‌లను అద్దెకు తీసుకుంది. ఇప్పటి వరకు కొనుగోళ్లు జరగకపోవడంతో సీసీఐ అద్దెకు తీసుకున్న ప్రైవేట్ జిన్నింగ్‌లలో ఆ వ్యాపారులే కొనుగోలు చేశారు. ఇప్పుడు సీసీఐ రంగంలోకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లులనే పత్తి కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది. గతంలో జిల్లా మార్కెట్‌లో తక్కువ ధరకు రైతుల వద్ద వ్యాపారులు పత్తిని కొనుగోలు చేసి సీసీఐకి మద్దతు ధరకు విక్రయించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమయ్యాయి. సీసీఐ అద్దెకు తీసుకున్న జిన్నింగ్‌లే కావడంతో వ్యాపారులు ఈ జిమ్కిక్కులకు పాల్పడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరిగే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతుంది.


