ఆదిలాబాద్‌టౌన్: పురిటి నొప్పులు భరిస్తూ.. నవమాసాలు మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చే సమయంలో గర్భిణులు తల్లడిల్లుతున్నారు. సకాలంలో వైద్యం అందక అర్ధంతరంగా లోకం వీడుతున్నారు. బాధిత కుటంబాలకు తీరని విషాదం మిగుల్చుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో గడిచిన ఏడు నెలల్లో ఎనిమిది మంది మృత్యువాత పడడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల చికిత్స పొందుతూ ఓ గర్భిణి మృతిచెందగా ఆమె కడుపులో ఉన్న ఇద్దరు కవలలు సైతం గర్భంలోనే తుది శ్వాస విడవడం గమనార్హం. ఈ ఘటనలకు గైనిక్ విభాగంలో లోపాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. వాటిని సరిదిద్దితే కానీ పురిటి గండం తప్పేటట్టు కనిపించడం లేదు. మరింత మంది గైనకాలజిస్టులను నియమిస్తే తప్పా సమస్యకు పరిష్కారం లభించదని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. గర్భిణి, బాలింతలు మృతిచెందిన సమయంలో విచారణ పేరిట కమిటీలు నియమించి చేతులు దులుపుకోవడం తప్పా ఎలాంటి ప్రయోజనం కానరావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
వైద్యుల కొరతతోనే..
రిమ్స్‌లోని గైనిక్ విభాగంలో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. అన్ని విభాగాల కంటే పీడియాట్రిక్, గైనిక్ విభాగాలే ముఖ్యం. గైనిక్‌లో ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు ఎస్‌ఆర్‌లు, నలుగురు పీజీలు ఉన్నారు. ఒక్కోషిఫ్టులో 24గంటల పాటు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్‌ఆర్, పీజీ విధులు నిర్వహిస్తున్నారు. వీరే ఓపీ, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్‌తో పాటు గర్భిణులను పరిశీలించాల్సి వస్తోంది. పనిభారం సైతం పెరిగిపోయింది. మరింత మంది వైద్యులు, సిబ్బందిని నియమిస్తే తప్పా ఈ మృత్యుఘోషను ఆపే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉట్నూర్, ఆసిఫాబాద్, మహారాష్ట్రకు చెందిన గర్భిణులు రిమ్స్‌కు వస్తున్నారు. అక్కడ గైనిక్‌లు ఉన్నప్పటికీ రిమ్స్‌కే రిఫర్ చేస్తున్నారు. రిస్క్ లేనివారితో పాటు హైరిస్క్ ఉన్నవారిని ఇక్కడికే పంపడంతో వైద్యులకు పనిభారం పెరిగిపోయింది. స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది సైతం తక్కువగానే ఉన్నారు. ఈ ప్రభావమంతా గర్భిణులకు అందించే సేవలపై పడుతుంది.
వైద్యుల నిర్లక్ష్యం సైతం..
ప్రసూతి వార్డులో కొంతమంది వైద్యుల నిర్లక్ష్యంతో పాటు పలువురు గర్భిణులు తీవ్ర అస్వస్థతకు గురై న సమయంలో వారు అందుబాటులో ఉండకపోవడం, సీనియర్ రెసిడెంట్లు, పీజీలతోనే వైద్యసేవలు కొనసాగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడమే గర్భిణుల మృతికి కారణమంటూ బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈవిషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.
రిమ్స్ ఆస్పత్రి


