బోథ్: ఆరుగాలం శ్రమించే రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. పండించిన పంటకు దిగుబడి వస్తే మా ర్కెట్‌లో ధర ఉండదు.. ధర పలికితే దిగుబడి ఉండదు. ప్రస్తుతం జిల్లాలోని సోయా రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ఏడాది మార్కెట్‌లో సోయాకు రికార్డు స్థాయి ధర ఉందని సంతోషపడాలో, దిగుబడి తగ్గిందని బాధపడాలో తెలియని అయోమయ స్థితి కనిపిస్తోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఈ వానాకాల సీజన్‌లో జిల్లావ్యాప్తంగా దాదాపు 63 వేల ఎకరాల్లో రైతులు సోయా సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. కీలకమైన పూత, కాత దశలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సోయా పంట తీవ్రంగా దెబ్బతింది. సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి సగటున 10 నుంచి 12క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉంది. ఈసారి చాలా మంది రైతులకు కేవలం 4 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. భూసారం తక్కువగా ఉన్న చోట 3 క్వింటాళ్ల లోపే వస్తుండడం గమనార్హం.
రికార్డు ధర.. అయినా దక్కని ఫలితం
ప్రభుత్వం ఈ ఏడాది సోయాకు రూ.5,708 మద్దతు ధరగా నిర్ణయించింది. అయితే దిగుబడి భారీగా తగ్గడంతో ప్రైవేటులో డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.6,800 నుంచి రూ.7,100 వరకు చెల్లిస్తున్నారు. మద్దతు ధరతో పోల్చితే రూ.1,100 నుంచి రూ.1,400 వరకు అదనంగా లభిస్తోంది. అయితే ఎకరానికి 3 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే చేతికి రావడంతో పెరిగిన ధర రైతులకు ఏమాత్రం ఊరటనివ్వడం లేదు. విత్తనాలు, ఎరువులు, పురు గు మందులు, దుక్కులు, కూలీల ఖర్చులు తడిసిమోపెడవ్వడంతో కనీసం పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో
సోయా సాగు 63 వేల ఎకరాల్లో
ప్రభుత్వ మద్దతు ధర రూ.5,708
ప్రైవేట్‌లో ధర
రూ.6,800–రూ.7,100 వరకు
దిగుబడి తగ్గింది
ఈ ఏడాది సరైన వర్షాలు లేక సోయా దిగుబడి తగ్గింది. 16 ఎకరాల్లో పంట వేశాను. పెట్టుబడి పెరిగింది. దిగుబడి మాత్రం ఎకరానికి 6 క్వింటాల వరకే వచ్చింది. మార్కెట్‌లో ధర రూ.7వేలకు పైగా ఉండగా.. దిగుబడి సగానికి తగ్గడంతో నష్టాలే మిగిలాయి.
– కుంటాల ఉమేందర్, రైతు, బోథ్
ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ఏడాది 20 ఎకరాలు కౌలుకు తీసుకుని సో యా సాగు చేశా. కౌలు డబ్బులు, పెట్టుబడి కలిపి రూ. 5 లక్షల వరకు అయింది. వర్షాలు లేక ఎకరానికి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పెట్టిన ఖర్చు కూడా వచ్చేటట్టు కనిపించడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– కాల్వ ప్రవీణ్ రెడ్డి, ధన్నూర్ బి, బోథ్ (మం)


