తాంసి: భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లో మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. నిపాని గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉయికే స్వామి (30) ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని సినిమాల్లో ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. మూడురోజుల క్రితం స్నేహితులంతా కలిసి గదిలో పార్టీ చేసుకోగా గొడవ, దాడి జరిగింది. దీంతో బలమైన గాయం కావడంతో స్వామి మృతి చెందినట్లు సమాచారం. గది నుంచి దుర్గంధం వ్యాపించడంతో ఇరుగుపొరుగువారు గమనించి సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు మంగళవారం ఉదయం గది తలుపులు బద్దలు కొట్టి చూడగా స్వామి మృతదేహం కనిపించింది. దీంతో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటన జరిగి రెండ్రోజులవుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మధురనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


