మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీకి దసరా కలిసొచ్చింది. బతుకమ్మ, దసరా పండుగలకు ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌కు వేసిన స్పెషల్ బస్సుల ద్వారా సంస్థకు మంచి ఆదాయం వచ్చింది. అక్టోబర్ 10 నుంచి 23వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ఉద్యోగరీత్యా, చదువులు నిమి త్తం హైదరాబాద్‌లో ఉంటున్నవారంతా పండుగకు సొంతూళ్లకు వచ్చి వెళ్లారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వారి సౌకర్యార్థం ఆర్టీసీ సరిపడా ప్రత్యేక బస్సులు నడిపింది. ఈ ఏడాది దసరా సందర్భంగా అధికారులు రోజువారీ బస్సులతో పాటు రీజియన్‌వారీగా 533 స్పెషల్ బస్సులు తిప్పారు. దసరాకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది బస్సుల్లో ప్రయాణించటంతో ఆదాయం గణనీయంగా సమకూరింది
సాధారణ చార్జీలకంటే అధికంగా..
దసరా, బతుకమ్మ పండుగల రోజుల్లో ప్రధాన రూట్లలో ఆర్టీసీ అధికారులు ఆయా డిపోల నుంచి 533 బస్సులు నడిపారు. ప్రధానంగా జేబీఎస్ నుంచి ఎక్కువ సర్వీసుల్ని తిప్పారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీల కంటే అదనంగా వసూలు చేశారు. సాధారణ రోజుల్లో కంటే ఒకటిన్నర చొప్పున అదనంగా చార్జీలు వసూలు చేయటం ద్వారా ఆర్టీసీకి మంచి ఆదాయం సమకూరినా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
ముందంజలో నిర్మల్ డిపో
దసరా సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా రీజియన్ పరిధిలో సంస్థకు రూ.25.45 కోట్ల ఆదాయం సమకూరింది. రాబడి సాధించటంలో నిర్మల్ డిపో ముందు వరుసలో నిలిచింది. 11.06 లక్షల కిలోమీటర్లు బస్సులు తిప్పటం ద్వారా రూ.6.51 కోట్లు వసూలు చేసి ప్రథమ స్థానం దక్కించుకుంది. మంచిర్యాల డిపో 10.50లక్షల కిలోమీటర్ల ప్రయాణంతో రూ.5.90కోట్లు ఆర్జించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 90శాతం సాధించి బైంసా డిపో టాప్‌లో నిలవగా, ఉట్నూర్ 89శాతం, నిర్మల్ 87శాతం సాధించాయి. రోజువారీ సగటు ఆదాయం రూ.1.41 కోట్లు నమోదు కాగా, బస్సుల ఆక్యుపెన్సీ నిష్పత్తి 86శాతం సాధించింది.
18రోజులు.. రూ.25.45కోట్లు
దసరా వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ అత్యుత్తమ రాబడి సాధించింది. అక్టోబర్ 9నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక ఆపరేషన్లలో రీజియన్ పరధిలో 533 బస్సులు నడిపింది. మంచిర్యాల డిపో నుంచి 154బస్సులు, నిర్మల్ నుంచి 144, ఆదిలాబాద్ నుంచి 130, ఆసిఫాబాద్ నుంచి 62, భైంసా నుంచి 31, ఉట్నూర్ డిపో నుంచి 31బస్సులు తిప్పింది. ఈ స్పెషల్ బస్సులు మొత్తం 44.53 లక్షల కిలోమీటర్లు ప్రయాణించగా సంస్థకు రూ.25.45 కోట్ల పండుగ రాబడి వచ్చింది.


