డాక్టర్‌ కల నెరవేరేదెలా! | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కల నెరవేరేదెలా!

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

● ఎంబీబీఎస్‌లో ‘గిరి’ పుత్రికకు సీటు ● అడ్మిషన్‌ ఫీజు చెల్లించలేని దుస్థితి ● ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

తాండూర్‌: గిరి పుత్రికకు సరస్వతీ కటాక్షం దక్కినా లక్ష్మీ కటాక్షం లేకుండా పోయింది. మారుమూల గిరిజన గ్రామంలో మెరిసిన ఈ ఆణిముత్యం ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. డాక్టర్‌ కల నెరవేరకుండా ఆ కుటుంబం ఎదుర్కొంటున్న కడు పేదరికం అడ్డుగా నిలుస్తోంది. ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ ఫీజు కూడా చెల్లించలేని దయనీయ స్థితిలో ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఆ సరస్వతీ పుత్రిక వైద్య విద్యకు దూరమయ్యే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన పెంద్రం మోతీరాం– రత్నాబాయి దంపతుల ముగ్గురు సంతానంలో రెండో కూతురు శిరీష పదో తరగతి వరకు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ట్రైబల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో చదివింది. ఇంటర్మీడియట్‌ వికారాబాద్‌ జిల్లా పరిగి ట్రైబల్‌ వెల్ఫేర్‌ హాస్టల్‌లో పూర్తి చేసింది. మొదటిసారి నీట్‌ రాసినప్పటికీ నిరాశే ఎదురైంది. మళ్లీ ఉచిత లాంగ్‌టర్మ్‌ శిక్షణలో శ్రమించి సత్తా చాటింది. నీట్‌ ఫలితాల్లో మంచి ర్యాంక్‌ కై వసం చేసుకుని కొడంగల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు దక్కించుకుంది. కానీ, రోజువారీ కూలీ పనులు చేసుకుంటేనే గాని కుటుంబం గడవని పరిస్థితి వారిది. ఈ స్థితిలో అడ్మిషన్‌, హాస్టల్‌ తదితర ఫీజులన్నీ కలిపి రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు అవసరమవుతాయి. ఇంత మొత్తం వెచ్చించాలంటే మోతీరాంకు తలకు మించిన భారమే. దీంతో ఈ సరస్వతీ పుత్రికకు వైద్య విద్యాభ్యాసం అందని ద్రాక్షగా మారింది. ప్రజాప్రతినిధులు, దాతలు ఆపన్నహస్తం అందిస్తేనే ఈ గిరి ఆణిముత్యం విద్యాభ్యాసం కొనసాగించే పరిస్థితి ఉంది. వైద్య విద్యను పూర్తి చేసి మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు ఉచిత నాణ్యమైన వైద్యసేవలు అందించడంతో పాటు మెరుగైన సమాజం కోసం పాటుపడాలనుకునే సంకల్పంతో ఉన్న శిరీష విద్యాభ్యాసం కోసం దాతలు ముందుకు వచ్చి 6303853225 నంబర్‌లో సంప్రదించి ఆపన్న హస్తం అందించాలని పేద కుటుంబీకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement