బాసర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఇస్తున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జి.జానకీషర్మిల తెలిపారు. సమగ్ర ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో భాగంగా పాత పోలీస్‌స్టేషన్ భవనాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులు, స్థానిక ప్రజలకు పోలీస్ సేవల్లో అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక పోలీస్‌స్టేషన్ భవనాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాసరకు ప్రతీ రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారని, భద్రతపరంగా లోటుపాట్లు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. అనంతరం స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డు గది, రిసెప్షన్ కౌంటర్లను పరిశీలించారు. పోలీస్ అధికా రులు, సిబ్బందితో సమీక్షా సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. పొరుగు రాష్ట్రాలు, వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తుల సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. రాబోయే పండుగలు, విశేష పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలోని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర ఎస్‌హెచ్‌ఓ దీపక్ పాల్గొన్నారు.


