గుడిహత్నూర్: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన దేవ్‌కతే సంతోష్ (28) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సంతోష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో అక్కడ బేకరీ వ్యాపారం చేయడానికి తన తండ్రికి ఉన్న వ్యవసాయ భూమిపై వివిధ రూపాల్లో రూ.14 లక్షల అప్పు తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టం వాటిల్లింది. అనంతరం హోటల్ రంగంలో ఉద్యోగం చేస్తుండగా చాలీచాలని జీతంతో ఈఎంఐలు, అప్పులు కట్టలేక సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అప్పటి వరకు అందరితో కలివిడిగా ఉన్న సంతోష్ ఇంట్లో వారు దుర్గామాత మండపానికి వెళ్లగా పక్కనే ఉన్న పాత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


