ఆదిలాబాద్‌టౌన్: పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పిప్పర్వాడ టోల్‌ప్లాజా సమీపంలో జైనథ్ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.20 లక్షల విలువైన 20 వేల ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 90 బూస్టర్లు, రెండు వాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తికి చెందిన చెప్యాల పరశురాం, హనుమకొండ జిల్లా దుర్గానగర్ కాలనీకి చెందిన వల్లెపు తేజ, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింహులపల్లికి చెందిన కదం శ్రావణ్, భీమదేవరపల్లి మండలం కొప్పూరుకు చెందిన కస్తూరి సునీల్, ఇదే మండలంలోని విశ్వనాథ్కాలనీకి చెందిన సూర రంజిత్, శంకరపట్నం మండలం చింతలపల్లికి చెందిన కస్తూరి మధు కిరణ్, పాగల సంపత్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు ఎండి.వాహిద్, రవికుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవికుమార్ ద్వారా పేలుడు పదార్థాలను తీసుకువచ్చి మైన్స్, క్వారీలు, క్రషర్లకు అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో తేలిందన్నారు. ఇతరుల పేర్లపై బిల్లులు తీసుకుని బూస్టర్ బాక్సుల్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను నింపి తెలంగాణకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, జైనథ్ సీఐ జి.శ్రావణ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై పి.గౌతమ్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


