అక్షర శ్రీకారానికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

అక్షర శ్రీకారానికి వేళాయె

Oct 16 2026 7:47 AM | Updated on Oct 16 2026 7:47 AM

● నేడు మూలా నక్షత్రం ● బాసరకు పోటెత్తుతున్న భక్తులు ● ఏర్పాట్లు సమీక్షించిన కలెక్టర్‌, ఎస్పీ

భైంసా /బాసర: చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నేడు జరుగనున్న మూలా నక్షత్ర పూజలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యతంత విశిష్టమైన మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. దేవాదాయశాఖతో పాటు పోలీసు, రెవెన్యూ, తదితర శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా చిన్నారుల అక్షరాభ్యాసాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించారు. చిన్నారుల బోసి నవ్వులు.. పలకలపై దిద్దే తొలి అక్షరాలు.. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది.

అక్షరాభ్యాసాలపై ప్రత్యేక దృష్టి

మూలా నక్షత్రం రోజున బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించడం తల్లిదండ్రులు అత్యంత విశిష్టంగా భావిస్తారు. అమ్మవారి ఆశీస్సులతో విద్యా ప్రయాణం ప్రారంభిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు లభిస్తుందని తల్లిదండ్రులు విశ్వసిస్తారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి బాసరకు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్షరాభ్యాసాల నిర్వహణ, భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, దర్శన ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు సాధ్యమైనంత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టారు.

భారీ పోలీసు బందోబస్తు

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్మల్‌ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ ఉపేందర్రెడ్డి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్‌, డీఎస్పీ శ్రీనివాస్‌, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 250 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాలతో పాటు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది మోహరించి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. రద్దీని నియంత్రించడం, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చూడటం, భక్తులకు అవసరమైన సహాయం అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

కలెక్టర్‌, ఎస్పీ సమీక్ష

మూలా నక్షత్ర వేడుకల ఏర్పాట్లపై నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, ఎస్పీ జానకీ షర్మిల అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఆలయ ఈవో అంజనీ దేవి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

బాసరకు రైళ్ల ద్వారా చేరుకునే భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్‌ నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు సేవలను నిరంతరం కొనసాగిస్తున్నారు. మరోవైపు గోదావరి నది వద్దకు వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నది పరిసరాల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు.

బాలాలయంలోనే ఉత్సవాలు

బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి మూలా నక్షత్ర ఉత్సవాలు బాలాలయంలో నిర్వహిస్తున్నారు. భక్తుల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడకుండా, భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసాలు, అమ్మవారి దర్శనాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.

ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం

మూలా నక్షత్రం పూజలకు సంబంధించి బాసర ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు క్యూలైన్లలోనే పాలు, పండ్లు పంపిణీ, ప్రసాదాలు, పూజా టికెట్ల కోసం ప్రత్యేక కౌంటర్లు సిద్ధం చేశాం. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.

– అంజనీదేవి,

బాసర ఆలయ ఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement