జన్నారం: పాలపిట్ట అంటే ఓ శుభసూచకం. గిరిజన గోండు తెగకు చెందిన వారు ఇప్పటికీ పాలపిట్టను చూసిన తర్వాతే శుభకార్యాలు ప్రారంభిస్తారు. దసరా పండుగ రోజు పాలపిట్టను చూడడం శుభసూచకంగా పరిగణిస్తారు. అందరికీ శుభాలను అందించే.. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల రాష్ట్ర పక్షి పాలపిట్ట ప్రమాదంలో పడింది. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం పాలపిట్టను ‘మనుగడ ప్రమాదంలో పడిన జాతి’ జాబితాలో చేర్చింది. ఆధునిక వ్యవసాయంలో రసాయనిక పురుగు మందులు, గడ్డిమందు వాడకం పెరిగిపోవడం వల్ల పాలపిట్టలకు ఆహారమైన కీటకాలు అంతరించిపోతున్నాయి. విషపూరిత పురుగులను తినడం వల్ల ఇవి అనారోగ్యానికి గురవుతున్నాయి. సాధారణంగా చెట్లపై గూళ్లు కట్టుకుని జీవిస్తాయి. పాత, ఎండిపోయిన చెట్లను నరికి వేయడం వల్ల నివాస స్థలాలు, సంతనోత్పత్తి ఆవాసాలు కోల్పోతున్నాయి. దసరా పండుగ రోజు పాలపిట్టను కొన్ని ప్రాంతాల్లో టిని అక్రమంగా పట్టుకుని బోనుల్లో బంధించి ప్రదర్శించడం జరుగుతోంది. ఇలా స్వేచ్ఛను కోల్పోయి, తీవ్ర ఒత్తిడికి గురికావడం వల్ల చాలా పక్షులు మృత్యువాత పడుతున్నాయి.
రైతు నేస్తాలు
క్రిమి కీటకాలు, చిన్న సరీసృపాలు, ఉభయచరాలు పాలపిట్టల ఆహారం. సహజ ఆవరణ వ్యవస్థలు నాశనం కావడం వాటి మనుగడను దెబ్బతీస్తోంది. వ్యవసాయానికి హాని చేసే ఎన్నో కీటకాలను తినేసే పాలపిట్టలను రైతునేస్తంగా అభివర్ణిస్తారు.
వన్యప్రాణి చట్టంతో రక్షణ
వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 పాలపిట్టలకు రక్షణ కల్పించింది. పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం, ప్రదర్శించడం నేరం. రుజువైతే గరి ష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.లక్ష వర కు జరిమానా, కేసును బట్టి రెండూ విధించవచ్చు. గడ్డి మైదానాలు, బీడు భూములు, బహిరంగ ప్రదేశాలను కాపాడడం, విచక్షణారహితంగా పురుగు మందుల వాడకాన్ని నిలిపివేయడం, వన్యప్రాణి సంరక్షణ చట్టంపై ప్రజలలో అవగాహన కల్పించడం, చెట్లు తొలగింపును ఆపివేయడం, చెట్లను పెంచడం ద్వారా పాల పిట్టలు, వాటి ఆవాసాల మనుగడ ప్రమాదం నుంచి రక్షించవచ్చు.


