కుంటాల: పితృదేవతలను స్మరించుకుంటూ వారికి తర్పణాలు, శ్రాద్ధకర్మలు సమర్పించే పవిత్రమైన పితృపక్షం నేటి నుంచి అక్టోబర్ 10వరకు ఉంటుంది. తల్లిదండ్రులు మరణించిన తిథుల్లో కుటుంబీకులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. మహాలయ పక్షం (పెద్దల పండుగ)కు పూజా విధానానికి ప్రత్యేకత ఉంది. దర్భలు, నల్ల నువ్వులు, తెల్ల బియ్యం, నీటి చెంబు, అర్ఘ్య పాత్ర, పిండాలు చేయడానికి అన్నం, అరటిపండ్లను పూజకు వినియోగిస్తారు. పూర్వీకుల గోత్ర నామాలు స్మరించుకుంటూ తర్పణం చేస్తారు. బ్రాహ్మణులు, పేదలకు అన్నదానం చేయడం, గోవులకు గ్రాసం పెట్టడం వంటి కార్యక్రమాలు చేస్తే శుభం కలుగుతుందని భావిస్తారు. ఏడాదికోసారి పితృదేవతలను స్మరించుకుంటూ పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని వేదపండితులు ప్రకాశ్ జోషి తెలిపారు. పితృ దేవతలకు పూజలు చేసే క్రమంలో దక్షిణం వైపు కూర్చోవాలని పేర్కొన్నారు. దానధర్మాలు, అన్నదానం చేయాలని సూచించారు.


