విచారణ హైరానా! | - | Sakshi
Sakshi News home page

విచారణ హైరానా!

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

● ఓటర్ల పరిశీలనలో తీవ్ర జాప్యం ● ఓటర్లు సకాలంలో రాక తేదీల మార్పులు ● ఉమ్మడి జిల్లాలో ‘సర్‌’ ప్రక్రియలో జాప్యం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలన(ఎస్‌ఐఆర్‌)లో అన్‌మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్ల పరిశీలనతో బీఎల్‌వోలు, అధికారులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. ఓటర్లకు నోటీసుల జారీ నుంచి విచారణ(హియరింగ్‌) చేపట్టడం వరకు ప్రయాసగా మారింది. ఓటర్లకు తగిన రుజువులు లేకపోతే మరోసారి రావడం, ఓటర్లు నిర్ణీత సమయంలో బీఎల్‌వోల ముందు హాజరు కావడం లేదు. ఆ తేదీలు రద్దు(ల్యాప్స్‌) అవుతున్నాయి. బీఎల్‌వోలు ప్రతీ ఓటరు ఫొటో తీసుకుని యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. దీంతో చాలా చోట్ల వేలాది మంది ఓటర్ల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. ఒక్కో రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగటున కనీసం వెయ్యికి పైనే ఓటర్ల పరిశీలన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొందరు తగిన రుజువులు తీసుకురాకపోవడంతో మళ్లీ మళ్లీ హియరింగ్‌ ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలకు చాలామంది పదో తరగతి మార్కుల మెమో, బ్యాంకు పాస్‌బుక్‌, లేదా కుల ధ్రువీకరణలు అడుగుతున్నారు. ఆధార్‌, పాన్‌, రేషన్‌ కార్డులు ధ్రువీకరణకు ఆమోదించకపోవడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి.

గడవులోపు పూర్తయ్యేనా?

ప్రస్తుతం ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ఓటర్ల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ కొనసాగుతోంది. అదే సమయంలో ఓటర్ల తప్పులను సరి చేస్తున్నారు. చాలా వరకు చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ తప్పనిసరిగా రుజువు చూపించాలి. వేలాది ఓటర్లకు నోటీసుల జారీ, హియరింగ్‌, తేదీలు, బీఎల్‌వోలు ధ్రువపత్రాల పరిశీలన నుంచి ఆర్వోలు, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికారుల వరకు పరిశీలన చేయాలి. దీంతో గడవులోపు సర్‌ ప్రక్రియ పూర్తవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ తుది జాబితా ప్రచురణకు అక్టోబర్‌ 15నుంచి నవంబర్‌ 9వరకు గడువు పొడగించింది. అయితే నవంబర్‌ 5వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. ఈ క్రమంలో అనేక మంది ఓటర్లు సకాలంలో స్పందించకపోతే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement