ఓరి దేవుడా! | - | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడా!

Sep 12 2026 12:00 AM | Updated on Sep 12 2026 12:00 AM

ఇటు వర్షాభావం.. అటు కరెంటు కోతలు

వాడిపోతున్న మొక్కలు

పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

పంటకు నీళ్లందించలేక లబోదిబోమంటున్న రైతన్న

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాను శుక్రవారం తేలికపాటి వర్షం పలకరించింది. ఇది ఎటూ సరిపోని పరిస్థితి. రెండు వారాలుగా వరుణుడి జాడ లేక సాగు చేస్తు న్న పత్తి, సోయా, కంది పంట మొక్కలు వాడిపోతున్నాయి. ఈక్రమంలో రైతుల్లో దుఃఖం తన్నుకవస్తుంది. వర్షాభావ పరిస్థితుల్లో బోర్ల ఆధారంగా స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లందిద్దామంటే కరెంటు కోతల కారణంగా తడులు అందించలేని పరిస్థితి. జిల్లాలో ప్రధానంగా బోథ్‌, తలమడుగు తదితర మండలా ల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఈ విషయమై ఫోన్లు చేసినా స్పందన కరువైందంటూ వాపోతున్నారు. తలమడుగులో విద్యుత్‌ శాఖ అధికారులు పడిపోయిన విద్యుత్‌ స్తంభాలను మరమ్మతు చేయడంలో జాప్యం కారణంగా పంట చేలకు నీళ్లందించలేక రైతులు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఇదే మండలంలోని రుయ్యాడిలో పదే పదే కరెంటు కోతలతో పంటలకు నీళ్లందించలేక పోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశా రు. కరెంటు సరఫరాలో డ్రిప్‌ కావడంతో ఈ సమ స్య ఎదురవుతుందని అధికారులు చెబుతుండడం గమనార్హం.

వర్షాభావం..

జిల్లాలో జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 11 వరకు సాధాణ వర్షపాతం 908.6 మి.మీ.లు కాగా, 598.8 మి.మీ.లు కురిసింది. ఇది 34 శాతం లోటు. అలాగే 21 మండలాలకు గాను 20 మండలాల్లో వర్షాభావం నెలకొంది. రెండు వారాలకు పైగా సరైన వర్షాలు లేకపోవడంతో డ్రైస్పెల్‌ ఏర్పడుతుంది. తేలికపాటి వర్షం కురుస్తున్నప్పటికీ అది ఎటూ సరిపోలేని పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పెరిగిన విద్యుత్‌ వినియోగం..

వర్షాభావ పరిస్థితుల్లో పొడి వాతావరణం ఏర్పడింది. భూమిలో తేమ లేకపోవడంతో పంటలు వాడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బోర్ల ద్వారా నీళ్లందిద్దామంటే నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడం లేదు. జిల్లాలో 75వేల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇటు వ్యవసాయ చేలకు డిమాండ్‌ పెరగడం, అటు గృహ వినియోగదారులు ఉక్కపోత కారణంగా ఏసీలు, కూలర్లు వినియోగిస్తుండడంతో డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయింది. దీనికితోడు జిల్లాలో ఇటీవల చార్జింగ్‌ స్టేషన్లు కూడా ఏర్పాటు కావడంతో డిమాండ్‌ పెరిగిందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత కరెంటు సరఫరా తగ్గించినప్పటికీ కోతలు విధించడం లేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇది బోథ్‌కు చెందిన రైతు రాజు చేనులోని పత్తి మొక్కల పరిస్థితి. ఓ వైపు వర్షాభావం.. మరోవైపు కరెంటు కోతల కారణంగా నీటి తడులందక మొక్కలు ఇలా వాడిపోతున్నాయి. బోరుబావిలో నీరున్నా విద్యుత్‌ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పంట పెరిగే దశలో కరెంటు కోతలు లేకుండా చూడాలని ఈ రైతు అంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. జిల్లాలో చాలా మందిది ఇదే పరిస్థితి.

జిల్లాలో విద్యుత్‌ వినియోగం ఇలా..

వారం క్రితం వరకు: 1.35 మిలియన్ల యూనిట్లు

రెండు రోజుల క్రితం: 1.89 మిలియన్ల యూనిట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement