అప్పగించే బాధ్యతలు రేషన్ డీలర్లకే
జిల్లాలో నత్తనడకన పంపిణీ ప్రక్రియ
కొన్నింట్లో తప్పులతడకగా వివరాలు
పర్యవేక్షించని సంబంధిత అధికారులు
కై లాస్‌నగర్: ఆహారభద్రత కార్డుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కార్డుల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించి 25రోజులవుతున్నా ఇంకా లక్ష మందికిపైగా కార్డులు అందలేదు. వాటిని అందించే బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించిన అధికార యంత్రాంగం పర్యవేక్షణను విస్మరించింది. అయితే, మూడు నెలల సన్నబియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో వాటిని తీసుకుంటున్న లబ్ధిదారులు కార్డులు తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. లబ్ధిదారులు వస్తేనే కార్డులిస్తామనే ధోరణిలో రేషన్ డీలర్లు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో పూర్తిస్థాయిలో కార్డులు పంపిణీ కాని పరిస్థితి నెలకొంది.
25రోజులు గడిచినా 94వేలే..
ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీలో పారదర్శకత తీసుకురావడం, రేషన్‌కార్డుల ట్యాంపరింగ్‌కు చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో స్మార్ట్‌కార్డులు అందించాలని నిర్ణయించింది. క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్‌తో కూడిన డిజిటల్ కార్డులను సరఫరా చేసింది. జిల్లాలోని 2,26,733 మందికి వీటిని అందజేయాల్సి ఉంది. పంద్రాగస్టు వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ జిల్లాలో గత నెల 15న కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. స్థానిక ఎస్టీయూ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పలువురు లబ్ధిదారులకు స్వయంగా కార్డులు అందజేశారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీని ప్రారంభించి 25రోజులు గడిచినా ఇప్పటివరకు 94వేల కార్డులే పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.
25లోపు అందరికీ అందజేస్తాం
జిల్లాలో రేషన్ స్మార్ట్‌కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. మూ డు నెలల కోటా సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేయాల్సి ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బియ్యం పంపిణీ ముగియగా ఉదయం, సాయంత్రం దుకాణాలు తెరిచి స్మార్ట్‌కార్డులు పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించాం. లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టడంతోపాటు రేషన్ స్మార్ట్‌కార్డులన్నీ ఈ నెల 25లోపు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. నిర్లక్ష్యం చేసే డీలర్లపై కఠినచర్యలు తీసుకుంటాం. – నందిని, డీసీఎస్వో
స్మార్ట్‌కార్డుల వివరాలు
జిల్లాలోని మండలాలు 21
రేషన్ దుకాణాలు 356
జిల్లాకు అందిన కార్డులు 2,26,733
ఇప్పటివరకు పంపిణీ చేసినవి 94 వేలు
పంపిణీ చేయాల్సినవి 1,32,733
ఇప్పటికీ 94వేలు మాత్రమే అందజేత
పంపిణీ బాధ్యత డీలర్లదే..
స్మార్ట్‌కార్డుల పంపిణీ బాధ్యతలను అధికారులు రేషన్‌డీలర్లకే అప్పగించారు. షాపుల వారీగా కార్డులు సరఫరా చేసిన అధికారులు పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించడంలేదు. స్మార్ట్‌కార్డులు రాకముందే మూడునెలల సన్నబియ్యం పంపిణీ పూర్తి కాగా, లబ్ధిదారులు వాటిని తీసుకోవడంపై ఆసక్తి చూపడంలేదని డీలర్లు చెబుతున్నారు. లబ్ధిదారులు వస్తేనే ఇస్తామనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. లబ్ధిదారులు, డీలర్లు ఒకే తరహాలో వ్యవహరిస్తుండటంతో పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణ పరిధిలో 35,139 కార్డులుండగా ఇందులో సగం కూడా పంపిణీ జరగనట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.


