కై లాస్‌నగర్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకు బాధ్యతాయుతమైన సేవలందించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రేషన్ డీలర్లు, రైస్‌మిల్లర్లతో వేర్వేరుగా నిర్వహించిన సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. షాపులను నిర్దేశిత వేళల్లో తెరిచి ఉంచి సరుకులు అందించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కృషి చేస్తామని భరోసానిచ్చారు. ధాన్యం సేకరణతో పాటు సీఎంఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. మిల్లులకు చేరే ధాన్యం నాణ్యతను పరిశీలించడంతో పాటు, సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐ గోదాములకు ఎలాంటి జాప్యం లేకుండా అప్పగించడంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రూ, సబ్ కలెక్టర్ కె.ప్రణయ్‌కుమార్, ఆర్డీవో జగదీశ్వర్, డీసీఎస్వో నందిని, డీఎం సుధారాణి, రేషన్ డీలర్ల యూనియన్ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోషకాహార లోప నిర్మూలనే లక్ష్యం
తల్లీపిల్లల ఆరోగ్య రక్షణతోపాటు జిల్లాలో పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన తొమ్మిదో పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ నెల 9నుంచి అక్టోబర్ 8వరకు మన అంగన్‌వాడీ–మన బాధ్యత నినాదంతో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తహీనత నివారణకు ఆహారంలో వైవిధ్యం పాటించాలని సూచించారు. ప్రధానమంత్రి మాతా వందన యోజన లాంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులందరికీ చేరవేయాలని తెలిపారు. అనంతరం కార్యక్రమ పోస్టర్ ఆవి ష్కరించారు. జిల్లా సంక్షేమాధికారి మిల్కా, జెడ్పీ సీఈవో రవి, డీపీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, మెప్మా పీడీ రాజు, సీడీపీవోలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు.
భూసేకరణపై అపోహలొద్దు
భోరజ్ మండలంలోని రాంపూర్ (టి), గిమ్మ (బి), గూడ, హత్తిఘాట్ గ్రామాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం చేపడుతున్న భూసేకరణపై అపోహలు వద్దని కలెక్టర్ రాజర్షి షా ఓ ప్రకటనలో తెలి పారు. నాలుగు గ్రామాల్లో 2,062.01 ఎకరాల భూ మి సేకరించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈడీ అటా చ్ చేసిన భూముల్లో గూడలో 37.23 ఎకరాలు, రాంపూర్ (టి)లో 9.39 ఎకరాల చొప్పున 47.22 ఎకరాలే ప్రస్తుత భూసేకరణ ప్రతిపాదనల్లో ఉన్నట్లు తెలిపారు. ప్రక్రియ నిబంధనల మేరకు పారదర్శకతతో కొనసాగుతుందని పేర్కొన్నారు. ఏదైనా టైటి ల్ వివాదముంటే తెలంగాణ సవరణ చట్టం–2016 నిబంధనల ప్రకారం తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


